23 నుంచి వీఎంసీఏ వేసవి క్రికెట్ శిబిరం
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో పురాతన, 40 ఏళ్ల అనుభవం గల ధార్వాడలోని వసంత మురుడేశ్వర క్రికెట్ అకాడమి(వీఎంసీఏ) 39వ వార్షిక శిక్షణా శిబిరం ఈ నెల 23 నుంచి మే 18 వరకు జరగనుంది. రంజీ క్రీడాకారులు ఆనంద్ కట్టి, సోమశేఖర్, ఐపీఎల్ క్రీడాకారుడు పవన్ దేశ్‌పాండే, రాష్ట్ర సీనియర్ మహిళా జట్టు క్రీడాకారిణి అస్మిరాబాను తదితరులు సలహా సూచనలతో పాటు శిక్షణను అందించనున్నారు. సదరు సంస్థ నిర్వహించే 57 రోజుల ఈ శిక్షణా శిబిరంలో 8 నుంచి 20 ఏళ్ల వయస్సు వారికి అవకాశంతో పాటు బాలికలకు ప్రత్యేక రాయితీ ఉంటుంది. పూర్తి వివరాలకు వసంత మురుడేశ్వరను 9448119586 నెంబరులో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు
చెళ్లకెరె రూరల్: నగరంలోని హోటళ్లు, బేకరీలను నగరసభ ఇన్‌చార్జి అధ్యక్షురాలు సుమా భరమయ్య ఆకస్మికంగా పరిశీలించారు. హోటళ్లలో పరిశుభ్రత కాపాడకపోతే లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. నగరసభ ఆరోగ్య అధికారితో పాటు వివిధ ఉపహార కేంద్రాలను పరిశీలించి వంటగదులను తనిఖీ చేశారు. అక్కడ నెలకొన్న పరిశుభ్రతను చూసి హోటల్ యజమానులపై మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని శుభ్రత కాపాడాలని సూచించారు. ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన కూరగాయలను ఉపయోగించి రుచికరంగా ఆహార పదార్థాలను తయారు చేయాలన్నారు. ఫుట్‌పాత్ క్యాంటీన్ల వారు కూడా శుభ్రతను పాటించాలని, శుచికరంగా వంట పదార్థాలను తయారు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వేసవిలో హోటళ్లలో రక్షిత మంచినీటిని అందించాలన్నారు. చిత్రదుర్గ బస్టాండ్‌లోని ప్రజా మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా స్థాయి సమితి అధ్యక్షులు ఎం.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్లు తీర్చాలని ఆశాల ధర్నా
హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు కనీసం రూ.10 వేల వేతనాన్ని అందించాలని, బడ్జెట్‌లో హామీ ఇచ్చిన మేరకు రూ.1000 వేతనం పెంపు ఆదేశాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐయూటీయూసీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధార్వాడ జిల్లాధికారి కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర బడిగేర మాట్లాడుతూ ఆశా కార్యకర్తల నిరంతర పోరాటానికి స్పందించిన సీఎం ఏప్రిల్ 2025 నుంచి ప్రతి నెల ఆశా కార్యకర్తలకు ప్రోత్సాహధనంతో కలిపి కనిష్టంగా రూ.10 వేలు ప్రతి ఆశా కార్యకర్తకు గౌరవ ధనంగా ఇస్తామని ప్రకటించారు. ఆ హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం రాష్ట్ర కార్యకర్తలకు మేలు జరిగేలా సదరు ఆదేశాన్ని అమలు చేసి హామీ నెరవేర్చుకోవాలన్నారు. సంఘం జిల్లాధ్యక్షురాలు భువన బళ్లారి మాట్లాడుతూ గత 12 ఏళ్ల నుంచి నెలకు రూ.6 వేల గౌరవధనంతో శ్రమించే ఆశా కార్యకర్తలను సదరు విధుల నుంచి తొలగించే ఆదేశాలను వెల్లడించడం అందరికీ శరాఘాతం అయిందన్నారు. ఇంతకు ముందు హామీ ఇచ్చినట్లుగానే ఎక్కువ గౌరవ ధనం, డీఏ తదితరాలను అందించి తిరిగి విధులు నిర్వహించడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖురాలు మంజుల, భారతీ శెట్టర్, సరోజ, శోభ యాదవ్, రేణుకా, శారద తదితరులు పాల్గొన్నారు.
26 ఏళ్ల తర్వాత
పట్టుబడిన దొంగ
శ్రీనివాసపురం : పలు చోరీ కేసుల్లో నిందితుడైన దొంగ 26 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. చింతామణి తాలూకా సిద్దపల్లికి చెందిన అంజి అనే దొంగను శ్రీనివాసపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై పదికిపైగా చోరీ కేసులు ఉన్నాయి. 26 సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గురువారం ముళబాగిలు సమీపంలోని నరసింహ తీర్థం వద్ద ఉన్నట్లు అందిన సమాచారంతో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు.
Comments
Please login to add a commentAdd a comment