శ్మశానం గోడ మరమ్మతు చేయండి
బళ్లారిటౌన్: వాజ్‌పేయి లే అవుట్ సమీపంలోని శ్మశానం గోడ ఏడాది క్రితం కూలిపోయి స్థానికులకు భయభ్రాంతులు కలిగిస్తున్నందున ఈ గోడను పునర్నిర్మించాలని వాజ్‌పేయి లే అవుట్‌తో పాటు దొడ్డబసవేశ్వర లే అవుట్, శివసాయి టౌన్‌షిప్, స్టాండర్డ్ ఇన్‌ఫ్రా కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. గోడ పడిన చోట కొత్తగా ఓ ప్రైవేట్ హైస్కూల్‌ను నిర్మించినందున పాఠశాల గేట్ ముందు ఈ శ్మశానంలోని సమాధులు కనిపిస్తున్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ శ్మశానం సంగనకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నందున ఇటు మహానగర పాలికె గాని, అటు సంగనకల్లు గ్రామ పంచాయతీ వారు గానీ పట్టించుకోవడం లేదు. ఈ శ్మశానంలో మృతి చెందిన నగరవాసుల మృతదేహాలకు ఎక్కువగా అంత్యక్రియలు జరుపుతుంటారు. దీంతో గ్రామ పంచాయతీ వారు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇటీవల ముందు భాగంలో మాత్రం ప్లాట్‌ఫాం నిర్మించి మొక్కలను పెంచేందుకు మహానగర పాలికె ఆసక్తి చూపింది. అయితే ఇటు వైపు ప్రహరీ గోడ కూలిపోయి ఏడాది కావస్తున్నా దానికి మరమ్మతులు చేయకుండా వదిలేశారు. రాత్రి పూట అసలే వీధి లైట్లు లేక గాఢాంధకారం ఉండటంతో ఈ రోడ్డులో సంచరించేందుకు చుట్టుపక్కల ఉన్న వివిధ కాలనీల వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment