బైక్‌ని ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
సాక్షి,బళ్లారి: ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య గాయపడిన ఘటన గురువారం చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా జీరహళ్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలో జరిగింది. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా డీ.హిరేహాళ్ గ్రామానికి చెందిన భీమణ్ణ(45)పై నుంచి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. భార్య మీనక్కతో కలిసి ద్విచక్ర వాహనంలో వెళుతున్న సందర్భంలో గుర్తు తెలియని లారీ ఢీకొనగా లారీతో పాటు డ్రైవర్ పరారయ్యాడు. రోడ్డులో భర్త మృతదేహం చెల్లాచెదురుగా పడిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యం చూపరులను కలిచివేసింది. క్షణాల్లో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో భీమణ్ణ తల నుజ్జునుజ్జయి రోడ్డుపై మాంసపు ముద్దలా మారిపోయింది. తల, మొండెం దాదాపుగా వేరుగా పడిపోయి, రోడ్డులో రక్తపుటేరు ప్రవహించింది. దీంతో అదే రోడ్డు గుండా వెళుతున్న వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. చిత్రదుర్గ జిల్లా రాంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతివేగంతో ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లిన లారీ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఘటనా స్థలంలో భార్య కన్నీరుమున్నీరు
చూపరులను కలచి వేసిన దుర్ఘటన
Comments
Please login to add a commentAdd a comment