ఖమ్మం: మరో నాలుగు రోజుల్లో రీజినల్ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల నుంచి విద్యార్థులు హాజరుకానున్న పోటీల్లో తాము సైతం పాల్గొంటామని ఉత్సాహంగా ఉన్న విద్యార్థుల్లో ఒకరు విద్యుదాఘాతంతో మృతి చెందడం విషాదాన్ని నింపింది. వివరాలు.. పాలేరులోని నవోదయలో వచ్చేనెల 3వ తేదీ నుంచి రీజినల్ స్థాయి క్రీడా పోటీలు జరుగనున్నాయి.
దీంతో శనివారం సాయంత్రం ఫ్లెక్సీల ఏర్పాటుకు 12వ తరగతి విద్యార్థులు హలావత్ దుర్గానాగేందర్, శ్రీకుమార్.. ఈశ్వర్‌తో కలిసి ఇనుప ఫ్రేమ్ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఫ్రేమ్ పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలను తాకడంతో నాగేందర్ పడిపోగా, మిగిలిన ఇద్దరు షాక్ గురైనా తేరుకున్నారు. దీంతో స్థానికులు, ఉద్యోగులు నాగేందర్‌ను ఓ వ్యాపారి కారులో ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్ రావడంతో అందులో ఎక్కించారు.
అయితే, ఆస్పత్రికి చేరుకునేలోగా నాగేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం గాయపడిన శ్రీకుమార్, ఈశ్వర్‌ను కూడా కలెక్టర్ గౌతమ్ సూచనలతో ఖమ్మం ఆస్పత్రి తీసుకెళ్లారు.
ఆందోళన, దాడి
విద్యార్థి నాగేందర్ స్వస్థలం కూసుమంచి మండలంలోని కోక్యాతండా. ఆయన తండ్రి బాలాజీ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మేరకు నాగేందర్ మృతి చెందినట్లు తెలుసుకున్న కుటుంబీకులు చేరుకుని ‘మా కొడుకు మాకు కావాలి’ అంటూ గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలిసివేచింది.
అలాగే, పెద్దసంఖ్యలో చేరుకున్న బంధువులు, తండావాసులు ప్రిన్సిపాల్, ఉద్యోగుల నిర్లక్ష్య మే ఘటనకు కారణమని ఆరోపిస్తూ డార్మెటరీల అద్దాలు, ఫర్నీచర్ పగులగొట్టారు. ఆర్డీఓ స్వర్ణలత, ఖమ్మంరూరల్ ఏసీపీ బస్వారెడ్డి పరిస్థితులు సమీక్షించగా, సీఐలు జితేందర్‌రెడ్డి, రాజిరెడ్డి బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఘటన జరిగిన 40 నిమిషాల వరకు ప్రిన్సిపాల్, ఉద్యోగులు పట్టించుకోలేదని, సకాలంలో ఆస్పత్రికి తరలిస్తే నాగేందర్ బతికేవాడని తెలిపారు. ప్రమాదానికి కారణమైన విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని తెలిసినా సరిచేయించలేదని ఆరోపించారు.
సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం
నాగేందర్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చే క్రమంలో 108 సిబ్బంది సీపీఆర్ చేస్తూ వచ్చినా ఫలితం దక్కలేదు. కాగా, విద్యార్థి సంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకుని అక్కడే ఉన్న ప్రిన్సిపాల్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో పనులు చేయించడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.
టూటౌన్ పోలీసులు చేరుకుని వారికి నచ్చచెప్పినా వినకుండా ఆస్పత్రి ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నామాల ఆజాద్, ఇటికల రామకృష్ణ, ప్రవీణ్, వెంకటేశ్, మస్తాన్, శ్రీకాంత్, మల్సూర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని నవోదయ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ధరావత్ కీమానాయక్, నాగండ్ల దామోద్‌రావు డిమాండ్ చేశారు. కాగా, ఖమ్మం ఆర్డీఓ స్వర్ణలత శనివారం రాత్రి విద్యాలయకు చేరుకుని వివరాలు ఆరా తీశారు. అయితే, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయడమే కాక నాగేందర్ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లంచి, అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు.
ప్రిన్సిపాల్ సస్పెండ్
విద్యార్థి మృతికి బాధ్యుడిగా నిర్ధారిస్తూ నవోదయ ప్రిన్సిపాల్ ఏ.చంద్రబాబును సస్పెండ్ చేస్తూ నవోదయ విద్యాలయాల సమితి డిప్యూటీ కమిషనర్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment