స్తంభాద్రి గిరిప్రదక్షిణ.. వైభోగం
● దారి పొడవునా స్వామికి భక్తుల నీరాజనం ● ఆపై నక్షత్ర జ్యోతి దర్శనం
ఖమ్మంగాంధీచౌక్: అరుణాచలం, యాదగిరిగుట్ట మాదిరిగానే ఖమ్మంకు మూలమైన త్రేతాయుగం నాటి స్వయంభూ దివ్య క్షేత్రం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతీనెలా గిరి ప్రదక్షిణ నిర్వహించాలని నిర్ణయించగా మంగళవారం వేలాది మంది భక్తుల నడుమ నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారిని సతీసమేతంగా ఆలయం నుంచి పల్లకీపైకి చేర్చి గుట్ట కిందకు తీసుకొచ్చాక భజనలు, కోలాటాల నడుమ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. వేలాదిగా హాజరైన భక్తులు నృసింహ నామ స్మరణకు తోడు కీర్తనలు ఆలపిస్తూ పాల్గొన్నారు. స్తంభాద్రి ఘాట్ రోడ్డు గేటు వద్ద ప్రారంభమైన ప్రదక్షిణ ఎన్నెస్పీ రోడ్, కవిత డిగ్రీ అండ్ పీజీ కళాశాల, స్తంభాద్రి మండపం, సరిత క్లినిక్, ఎల్‌ఐసీ కార్యాలయం మీదుగా తిరిగి గేట్ నుంచి ఘాట్ రోడ్ ద్వారా గుట్టపై ఆలయం వద్దకు చేరింది. ఆతర్వాత ఆలయం పక్కన కొండపై నక్షత్ర జ్యోతిని అర్చకులు వెలిగించారు. ప్రతీనెల స్వాతి నక్షత్రం రోజున సాయంత్రం గిరి ప్రదక్షిణ ఉంటుందని ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామితో పాటు భక్త మండళ్ల బాధ్యులు, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు.
స్తంభాద్రి గిరిప్రదక్షిణ.. వైభోగం
Comments
Please login to add a commentAdd a comment