దళితులపై వివక్ష ఇంకెన్నాళ్లు..
● బీజేపీ మనువాద విధానాలను తిప్పికొట్టండి ● కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ
ఖమ్మంరూరల్: దళితులపై వివక్ష ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ ప్రశ్నించారు. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన కేవీపీఎస్ పాలేరు డివిజన్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆత్మగౌరవం, సమానత్వం, కులనిర్మూలన అనే లక్ష్యాలతో ఏర్పడిన సంఘమే కేవీపీఎస్ అని తెలిపారు. రాష్ట్రంలో వేలాది గ్రామాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంటరానితనంపై అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించామని చెప్పారు. ఆలయ ప్రవేశాలు, రెండు గ్లాసుల విధానం, గ్రామాల్లో కులం పేరుతో వివక్షల నిర్మూలనకు కేవీపీఎస్ కృషి చేస్తోందన్నారు. ఎస్సీ జనాభా సంక్షేమం, అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌లో రూ.20వేల కోట్లు కేటాయించాలని కోరారు. దళితుల వెనకబాటుకు మనువాదమే ప్రధాన కారణమని, దళితులంతా ఐక్యమై మనువాదులపై రాజీలేని పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులు ఏకమైతే మతోన్మాదుల ఆగడాలు చెల్లవని హెచ్చరించారు. అనంతరం 25 మందితో పాలేరు డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సదస్సులో కేవీపీఎస్ నాయకులు బి.రమేష్, పి.నాగేశ్వరరావు, నండ్ర ప్రసాద్, ఎం.భారతి, ఎన్.మనోహర్, ఎం.రమణ, బండి పద్మ, వెంకట్రావు, కొమ్ము శ్రీను, జానకిరాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment