● ఈనెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ● సిబ్బందికి పూర్తయిన శిక్షణ
ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 27న ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ప్రాధాన్యత ఓటింగ్ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇప్పటికే పూర్తయింది. జిల్లాలో 4,089 మంది ఓటర్లు ఉండగా.. వీరి కోసం 24 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈనెల 26న కలెక్టరేట్‌లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందజేయనున్నారు.
సిబ్బందికి పూర్తయిన శిక్షణ..
ఎన్నికల విధుల నిర్వహణపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.మాధవి సెక్టార్ అధికారులు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, మైక్రో అబ్జర్వర్లు, ఓపీఓలకు శిక్షణ ఇచ్చారు. బ్యాలెట్ బాక్స్‌లు తెరవడం, మూసివేయడం, సీల్ చేయడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. హ్యాండ్ బుక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు..
ఇక పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 పోలింగ్ కేద్రాల్లో సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఓటర్లు క్యూ పద్ధతి పాటించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంప్, టాయిలెట్స్ సౌకర్యం కల్పించారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సామగ్రి శనివారం జిల్లాకు చేరగా.. ట్రెజరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు.
పోలింగ్ ఇలా..
పోలింగ్ రోజు ఉదయం 7.30 గంటలకు సిబ్బంది ఖాళీగా ఉన్న బ్యాలెట్ బాక్స్‌లను ఏజెంట్లకు చూపుతారు. గ్రీన్‌పేపర్‌లో ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. బ్యాలెట్ బాక్స్‌పై పోలింగ్ కేంద్రం వివరాలు ఉండేలా పేపర్ అంటిస్తారు. ఓటరు కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేస్తారు. ఉదయం 10, మధ్యాహ్నం 12, 2, సాయంత్రం 4 గంటలకు పోలింగ్ నమోదు శాతం వివరాలు వెల్లడిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు ఓటరు స్లిప్‌లు ఇచ్చిన ప్రతీ ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం బ్యాలెట్ బాక్స్‌లను మూసి సీల్ చేస్తారు. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఎన్నికలను పర్యవేక్షిస్తుండగా.. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) పద్మశ్రీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా 8 రూట్లుగా విభజించారు. సెక్టార్ అధికారులు సంబంధిత పనుల్లో నిమగ్నమయ్యారు. 24 మంది సూక్ష్మ పరిశీలకులు, 24 మంది పీఓలు, 24 మంది ఏపీఓలు, 45 మంది ఓపీఓలు విధులు నిర్వహిస్తారు. అదనంగా మరికొంత సిబ్బందిని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment