వేగంగా మ్యాన్‌రైడింగ్ పనులు
● త్వరలోనే కేపీయూజీ మైన్‌లో అందుబాటులోకి... ● తీరనున్న కార్మికుల కష్టాలు
మణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఏరియాలోని కొండాపురం భూగర్భ గని(కేపీయూజీ)లో మ్యాన్ రైడింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మరో పది రోజుల్లో మ్యాన్ రైడింగ్ అందుబాటులోకి రానుండగా, కార్మికుల ఇక్కట్లు తీరనున్నాయి. ప్రస్తుతం రోజుకు 1.2 కి.మీ. మేర గనిలోకి నడిచి వెళ్లాల్సి రావడంతో కార్మికుల పని గంటలపై ప్రభావం పడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ మిషనరీ హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఎంఈహెచ్‌ఎల్) ఆధ్వర్యాన చేపట్టిన మ్యాన్ రైడింగ్ అందుబాటులోకి వస్తే అటు కార్మికుల ఇక్కట్లు తీరతాయని.. ఇటు ఉత్పత్తి మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ పనులు చాన్నాళ్ల క్రితమే పూర్తి కావాల్సి ఉన్నా డిసెంబర్‌లో ఏర్పడిన బుంగల కారణంగా ఆలస్యమైంది.
పెరగనున్న ఉత్పత్తి
ఆది నుంచి రకకాల కారణాలతో అవరోధాలు ఎదురవుతుండగా, బొగ్గు ఉత్పత్తి కోసం అధికారులు అవస్థలు పడుతున్న నేపథ్యాన కేపీయూజీ మైన్‌లో మ్యాన్ రైడింగ్ పూర్తయితే ఉత్పత్తి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక్కడ లభించే జీ–6 గ్రేడ్ బొగ్గుకు బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీంతో మ్యాన్ రైడింగ్ అందుబాటులోకి రాగానే కార్మికుల పనిగంటలు పెరుగుతాయని, తద్వారా నిర్దేశిత లక్ష్యాలు సునాయాసంగా సాధించొచ్చని చెబుతున్నారు.
లక్ష్య సాధనకు కృషి
గతంలో కోల్‌సీమ్స్ కారణంతో ఎస్‌ఎంఎస్ పనులు ఆగిపోవడం, ఆపై గని అంతర్భాగంలో బుంగ ఏర్పడడం వంటి కారణాలతో నిర్దేశిత లక్ష్యాలకు చేరువగా ఉత్పత్తి నమోదవుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే లక్ష టన్నుల లక్ష్యానికి మించి అదనంగా 41వేల టన్నులు ఉత్పత్తి సాధించారు. ప్రస్తుతం అధికారుల ప్రత్యేక దృష్టితో ఉత్పత్తి లక్ష్యాలు క్రమక్రమంగా పెంచుతూ ఈ ఏడాది 2.10లక్షల టన్నులుగా నిర్దేశించారు. అయితే, డిసెంబర్, జనవరిలో బుంగ ప్రభావం చూపినా, ప్రస్తుతం రోజుకు 500 టన్నుల బొగ్గు వెలికితీస్తున్నారు. దీంతో లక్ష్యంలో 1.60లక్షల టన్నుల మేర నమోదయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కాగా, మరో ఇరవై ఏళ్ల భవిష్యత్ ఉన్న కేపీయూజీలో మైన్ రైడింగ్ అందుబాటులోకి రానుండడంపై కార్మికులు, యూని యన్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో అందుబాటులోకి...
త్వరలోనే మ్యాన్
రైడింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. తద్వారా గనిలో ఉత్పత్తి సామర్థ్యం పెరిగి లక్ష్య సాధన సులువవుతుంది. ఇక భూగర్భ గనిలో నీరు ఉబికిరావడం సాధారణమే అయినా బయటకు పంపింగ్ చేస్తూ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా చూస్తున్నాం.
– దుర్గం రాంచందర్, ఏరియా జీఎం
వేగంగా మ్యాన్‌రైడింగ్ పనులు
Comments
Please login to add a commentAdd a comment