నిల్వ పంటకు రుణ సౌకర్యం
● పంట తాకట్టుపై విలువలో 75శాతం మేర రుణాలు ● ఆరు నెలల పాటు వడ్డీ మినహాయింపు ● ఖమ్మం జిల్లాకు రూ.10.30 కోట్ల నిధులు
ఖమ్మంవ్యవసాయం: పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో నిల్వ చేసి రుణం పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ‘రైతు బంధు’ పేరిట ఈ పథకాన్ని మార్కెటింగ్ శాఖ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఈ ఏడాది ఖమ్మం జిల్లాకు రూ.10.30 కోట్ల నిధులు కేటాయించింది. 2013–14 నుంచి ఈ పథకం అమలులో ఉన్నా అంతగా ఆదరణ లభించడం లేదు. తొలుత కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిన పంటలకు మాత్రమే పథకాన్ని అమలు చేయగా, కరోనా సమయంలో మిర్చి రైతులకు ఉపయోగపడింది. 2020–21లో అత్యధికంగా జిల్లాలో 1,513 మంది రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి రూ.1,732.52 లక్షల మేర రుణం పొందారు. కాగా, ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్నలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తుండడంతో రైతులకు అవసరం రాకపోగా, పత్తి పంటకు మాత్రం అవకాశం లేదు. ఇక గత ఏడాది మిర్చికి మంచి ధర ఉండటంతో కేవలం 36 మంది రూ.65 లక్షలను రైతుబంధు పథకం కింద రుణం తీసుకున్నారు. ఈ ఏడాది మాత్రం మిర్చి ధర బాగా పతనమైన నేపథ్యాన రైతులు ‘రైతుబంధు’ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు..
మార్కెట్ల వారీగా నిధుల కేటాయింపు
రైతుబంధు పథకానికి మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మార్కెట్ల వారీగా నిధులను మంజూరు చేసింది. ఖమ్మం జిల్లాలోని ఎనిమిది మార్కెట్లకు గాను ఏన్కూరు మినహా మిగిలిన ఏడింటికి నిధులు అందాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రూ.5 కోట్లు, వైరాకు రూ.3 కోట్లు, మధిరకు రూ.కోటి, మద్దులపల్లికి రూ.50 లక్షలు, కల్లూరుకు రూ.50 లక్షలు, నేలకొండపల్లికి రూ.20 లక్షలు, సత్తుపల్లి మార్కెట్‌కు రూ.10 లక్షలు కేటాయించగా మద్దులపల్లి మార్కెట్ పరిధిలో 33 మంది రైతులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
రూ.2 లక్షల రుణం..
ఆరు నెలలు వడ్డీ మినహాయింపు
పంట నిల్వ ఆధారంగా ఒక్కో రైతుకు రూ.2 లక్షల మేర రుణ సౌకర్యం కల్పిస్తున్నారు. రుణం కావాలనుకునే రైతులు పంటను గోదాంలు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి ధ్రువపత్రాలు సమర్పిస్తే అధికారులు ధర ఆధారంగా 75 శాతం మేర రుణంగా చెల్లిస్తారు. ఇది అత్యధికంగా రూ.2 లక్షల వరకు ఉంటుంది. ఇక రుణాలకు ఆరు నెలల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. 180 రోజుల నుంచి 270 రోజుల వరకు 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. 270 రోజుల్లో రుణం చెల్లించి పంట తీసుకోకపోతే వేలంలో విక్రయించి వచ్చే నగదును మార్కెటింగ్ శాఖ జమ చేసుకుంటుంది. అంతేకాక నిల్వ చేసిన పంటకు బీమా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.
సద్వినియోగం చేసుకోవాలి
పండించిన పంటలను గోదాంలు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి రైతుబంధు ద్వారా రుణాలు పొందొచ్చు. పంట ధరల ఆధారంగా 75 శాతం మేర రుణంగా అందిస్తాం. గతంలో ధాన్యానికే వర్తింపజేసిన ఈ పథకాన్ని కరోనా తర్వాత మిర్చి పంటకు కూడా వర్తింపజేస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.ఏ.అలీం,
ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి
నిల్వ పంటకు రుణ సౌకర్యం
Comments
Please login to add a commentAdd a comment