తాగునీటిలో విషప్రయోగం
తిరుమలాయపాలెం: కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతుని అంతమొందించేందుకు తాగునీటిలో విషం కలిపి హత్య చేసిన ఘటన మండలంలోని సోలీపురం శివారు పీక్యాతండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోతు రామోజీ (59) కాకరవాయి గ్రామంలో ఓ రైతు భూమిని కౌలుకి తీసుకున్నాడు. రామోజీ పక్కనే ఇదే తండాకు చెందిన బానోతు రవి మరో రైతు భూమిని అధిక ధరకు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో రామోజీ చేస్తున్న భూమిని కౌలుకి తీసుకునేందుకు కుట్ర పన్నాడు. కొన్నిసార్లు వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. గత నెల (ఫిబ్రవరి) 12న రామోజీ చేను వద్ద తాగునీటి క్యాన్‌ని పెట్టుకోగా ఎలాంటి అనుమానం రాకుండా రవి విషం కలిపాడు. ఇది గమనించని రామోజీ ఆ నీటిని సేవించి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా విషం కలిపిన నీటిని సేవించినట్లు గుర్తించి రామోజీ కుమారుడు కొందరు అనుమానితులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బానోత్ రవిపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా తాగునీటిలో విషం కలిపింది తానేనని ఒప్పుకున్నాడు. చికిత్స పొందుతున్న రామోజీ శనివారం సాయంత్రం మృతిచెందాడు. దీంతో పీక్యాతండాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కూచిపూడి జగదీశ్ తెలిపారు.
నీరు సేవించిన రైతు ఆస్పత్రిలో
చికిత్స పొందుతూ మృతి
తాగునీటిలో విషప్రయోగం
Comments
Please login to add a commentAdd a comment