ఆ మొక్కలూ ఆఫ్‌టైపే..
స్పందించని ఆయిల్ ఫెడ్ యాజమాన్యం
దమ్మపేట: పామాయిల్ సాగులో కొన్ని మొక్కలు చనిపోగా, వాటి స్థానంలో ఆయిల్ ఫెడ్ నర్సరీ అందజేసిన మొక్కలు కూడా ఆఫ్‌టైప్ కావడంతో రైతులు నిర్ఘాంతపోతున్నారు. మండలంలోని జగ్గారం గ్రామానికి చెందిన రైతు చెలికాని సూరిబాబు తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న 30 ఎకరాల భూమిలో ఏడేళ్ల నుంచి పామాయిల్ సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల కిందట తోటలో 50 మొక్కలు చనిపోగా, వాటి స్థానంలో ఆయిల్ ఫెడ్ నర్సరీ నుంచి తెచ్చిన కొత్త మొక్కలను నాటి, సాగు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో మూడేళ్ల సాగు అనంతరం 50 మొక్కల్లో 30 మొక్కలు ఆఫ్‌టైప్‌కి చెందినవని తెలిసింది. ఈ మొక్కలకు ఎలాంటి గెలల కాపు లేకపోగా, వాటి సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం వృథాగా భావించిన రైతు, వాటిని నరకడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అసిస్టెంటు, ఉన్నతాధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించే వరకు నరకవద్దని సూచించారు. రోజులు గడుస్తున్నా ఏ ఒక్క ఉన్నతాధికారి తోట సందర్శనకు వచ్చిందే లేదని రైతు వాపోతున్నాడు. ఈ ఆఫ్‌టైప్ మొక్కలతో రూ.లక్షల్లో రైతులకు నష్టం జరుగుతున్నప్పటికీ ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నాడు. ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, రైతులకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment