చింతకాని : వరికి బదులు ఆరుతడి పంటలు సాగుచేస్తే అధిక ఆదాయాన్ని పొందవచ్చని రాజేంద్రనగర్ సమగ్ర వ్యవసాయ పద్ధతుల విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ ప్రగతి కుమారి అన్నారు. మండలంలోని బస్వాపురం రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, మధిర వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఆరుతడి పంటల సాగుపై రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని 75 జిల్లాల్లో ఆరుతడి పంటల సాగును పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టినట్లు తెలిపారు. చింతకాని మండలం రామకృష్ణాపురం, బస్వాపురం, రాఘవాపురం గ్రామాలకు చెందిన 109 మంది రైతులను ఎంపిక చేసి వరికి బదులుగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, పెసర, మినుము పంటలను సాగు చేయించామని తెలిపారు. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే ఎకరానికి వరి కంటే రూ.29 వేలు నికర ఆదాయం రావడమే కాక 47 శాతం నీటి వినియోగం తగ్గుతుందని తెలిపారు. అలాగే పెసర, మినుము పంటలు సాగుచేసినా అదనంగా ఆదాయం పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో మధిర వ్యవసాయ శాస్త్రవేత్తలు రుక్మిణీదేవి, నాగస్వాతి, భరత్, ఏడీఏ విజయ్ చంద్ర, మండల వ్యవసాయాధికారి మానస, వ్యవసాయ విస్తర్ణాధికారి ఆయేషా తదితరులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలతో అధిక ఆదాయం