యాప్‌లోనే హోరాహోరీ | - | Sakshi
Sakshi News home page

యాప్‌లోనే హోరాహోరీ

Published Tue, Apr 1 2025 12:27 PM | Last Updated on Tue, Apr 1 2025 3:24 PM

యాప్‌

యాప్‌లోనే హోరాహోరీ

● ఐపీఎల్‌ వేళ ఆన్‌లైన్‌లో పందేల జోరు ● ప్రతీ బంతి, ఓవర్‌... వికెట్‌పై బెట్టింగ్‌ ● పాల్గొంటున్న వారిలో యువతే ఎక్కువ...

ఖమ్మం స్పోర్ట్స్‌: ప్రతీ బాల్‌.. వికెట్‌.. ఓవర్‌ ఇలా చెబుతూ పోతే బెట్టింగ్‌రాయుళ్లకు దేన్నీ వదలడం లేదు. ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 18వ సీజన్‌ కొనసాగుతుండడంతో పందేలు జోరందుకున్నాయి. అయితే, ఈ బెట్టింగ్‌లో యువత ఎక్కువగా పాల్గొంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ మొదలైందంటే చాలు బుకీలు యాప్‌ల ద్వారా యువతను ఆకర్షిస్తున్నారు. దీంతో అవగాహన లేకున్నా కొందరు వివరాలు తెలుసుకుని మరీ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిసింది. బెట్టింగ్‌కు ప్రత్యేకంగా యాప్‌లు ఉండగా.. వీటి వివరాలను యువతకు వివరిస్తూ బుకీలు పందేనికి ప్రోత్సహిస్తున్నారు. రూ.100తో ప్రారంభమయ్యే ఈ బెట్టింగ్‌తో రూ.వేలల్లో సులువుగా సంపాదించచ్చని ప్రచారం చేస్తుండగా.. సంపాదన మాటేమో కానీ ఎక్కువ మంది రూ.వేలల్లో పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఖమ్మం కేంద్రంగా యువకులు ఈ బెట్టింగ్‌కు పాల్పడగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సోకడంతో బుకీల ఫోన్‌ నంబర్లు సేకరించి మరీ యాప్‌ల ద్వారా పందేనికి సిద్ధమవున్నారు.

ముందుగానే అకౌంట్‌ లింక్‌..

బుకీల చెప్పిన యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాక పందేం కాసే వ ఆరు తమ బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ , ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తదితర వివరాలు నమోదు చేసుకోవాలని చెబుతున్నట్లు తెలిసింది. ఆపై పరుగు, వికెట్‌, ఫోర్‌, సిక్స్‌లకు ఎంత అని నిర్ణయించి పందేనికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అంతేకాక ప్రతీ బెట్టింగ్‌కు కోడ్‌ ఇస్తూ నమ్మకం ఉంటేనే ఆ కోడ్‌ నమోదు చేయాలని, తద్వారా నష్టపోయే అవకాశం లేదని నమ్మబలుకుతున్నట్లు తెలిసింది. దీంతో యువకులు ఎవరికి వారు నమ్మకంగా బెట్టింగ్‌ కాస్తూ నష్టపోతున్నట్లు సమాచారం.

బార్లలో జోరుగా బెట్టింగ్‌

ఖమ్మంలోని త్రీ టౌన్‌, టూ టౌన్‌, వన్‌న్‌ టౌన్‌న్‌ ప్రాంతాల బార్లలో బెట్టింగ్‌ జోరుగా కొనసాగుతుందని చెబుతున్నారు. యాప్‌ల ద్వారా కొందరు.. నేరుగా కొందరు పందేలు కాస్తున్నట్లు సమాచారం. కాగా, ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న యువకులు డబ్బుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. రకరకాల కారణాలు చెబుతూ డబ్బులు అడుగుతుండడంతో.. ఐపీఎల్‌ ఎప్పుడు ముగుస్తుందా అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

క్రికెటే కాదు మరిన్ని...

బెట్టింగ్‌ యాప్‌లు ఇన్నాళ్లు క్రికెట్‌కే పరిమితం అయ్యాయని భావిస్తుండగా.. ఇంకొన్ని ఆటల్లోనూ ఈ సంస్కృతి మొదలైందని చెబుతున్నారు. ఫుట్‌బాల్‌, టెన్నిస్‌, కబడ్డీ, గుర్రపు పందేలనైనా బెట్టింగ్‌ యాప్‌లు పని చేస్తున్నాయని సమాచారం. ఎవరికి ఏ క్రీడపై ఆసక్తి ఉందో కనుక్కుని మరీ బుకీలు ఈ యాప్‌లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది.

బెట్టింగ్‌ ఇలా...

బుకీలు చెప్పేవే కాక మరికొన్ని యాప్‌ల ద్వారా బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాక మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం అవుతుంటుంది. అంతేకాక స్క్రీన్‌పై కింద భాగంలో బెట్టింగ్‌ వివరాలను బుకీలు జోడిస్తుంటారు. దీంతో టాస్‌ ఎవరు గెలుస్తారు.. ఆటగాళ్ల వ్యక్తిగత స్కోర్‌, వచ్చే బంతికి ఎన్ని పరుగులు వస్తాయి, ఫలానా బౌలర్‌ ఈ ఓవర్‌లో వికెట్‌ తీస్తాడా, మొత్తంగా ఎవరు గెలుస్తారు ఇలా ప్రతీ అంశానికి బెట్టింగ్‌ కాస్తుండడంతో నమ్మకంగా ముందుకొస్తున్న యువత చివరకు నష్టపోతున్నారు.

యాప్‌లోనే హోరాహోరీ1
1/1

యాప్‌లోనే హోరాహోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement