
ప్రార్థనలకు రాజకీయ నాయకులు వద్దు..
● మాజీ మంత్రి పాల్గొనడంపై ముస్లింల అభ్యంతరం ● కాంగ్రెస్ నేతల ఉపన్యాసాలకూ అడ్డు
ఖమ్మం అర్బన్: రంజాన్ సందర్భంగా ఖమ్మం గొల్లగూడెం ఈద్గా వద్ద సోమవారం పెద్దసంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. అయితే, ప్రార్థనలో ముస్లింలతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొనడంపై పలువురు అభ్యంతరం తెలిపారు. ప్రార్థనలో హిందువులు పాల్గొనవద్దని, పక్కన ఏర్పాటుచేసిన టెంట్ కింద కూర్చుని ప్రార్థన ముగిశాక శుభాకాంక్షలు తెలపాలని అన్నారు. దీంతో పువ్వాడ సమీపంలోని టెంట్ వద్దకు చేరుకుని, ఆతర్వాత ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి వెళ్లిపోయారు. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రార్థన ముగిశాక ఈద్గాకు వచ్చి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, అక్కడ మిగిలి ఉన్న వారిని ఉద్దేశించి తుమ్మల సమక్షాన ముస్లిం నాయకులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేయబోగా పలువురు అడ్డుచెప్పారు. పవిత్రమైన రంజాన్ పండుగ ప్రార్థనలో రాజకీయ ప్రసంగాలు చేయొద్దని సూచించారు.