
తల్లిదండ్రులే స్ఫూర్తిప్రదాతలు
మధిర: మధిర మండలంలోని చిన్న గ్రామం నాగవరప్పాడు. ఆ గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు తల్లిదండ్రులే స్ఫూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఇంకొందరికి ఆదర్శంగా నిలిచారు. నాగవరప్పాడుకు చెందిన భీమనబోయిన వెంకట నరసయ్య – రాధ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకటనరసయ్య మూడు దశాబ్దాల క్రితం హోంగార్డ్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి పొలం పనులు చూసుకునేవాడు. వ్యవసాయంపై దృష్టి పెట్టలేక హోంగార్డు ఉద్యోగం మానేశారు. అయితే, ఎస్‌ఐ తదితర అధికారులకు అందే విలువ, గౌరవ మర్యాదలను చూసిన ఆయన తన కుమారులిద్దరు పోలీస్ ఉద్యోగాలకు ఎంపియ్యేలా స్ఫూర్తిగా నింపారు. దీంతో పెద్ద కుమారుడు గోపీకృష్ణ 2015లో బీటెక్ పూర్తి చేసి 2017లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఇక చిన్న కుమారుడు మనోహర్ గోపి 10వ తరగతి వరకు గోసవీడు ప్రగతి స్కూల్‌లో, ఇంటర్ విజయవాడ శ్రీ చైతన్యలో, బీటెక్‌లో జేఎన్టీయూలో పూర్తిచేశాక కొన్నాళ్లు ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చేలా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమై తొలిప్రయత్నంలోనే ఏఎంవీఐగా, ఏపీలో నాన్ లోకల్ కోటా కింద ఎస్సైగా, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు సాధించడమే కాక గ్రూప్–4లో రాష్ట్రస్థాయి 84, ఖమ్మం జిల్లాలో రెండో ర్యాంక్ సాధించారు. ఆపై పాలిటెక్నిక్ లెక్చరర్‌గానూ ఉద్యోగం సాధించిన మనోహర్ గోపి ఇటీవల మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విధుల్లో చేరాడు.
తల్లిదండ్రులే రోల్ మోడల్..
వెంకట నరసయ్య హోంగార్డ్ ఉద్యోగం చేస్తూనే పొలం పనులకు వెళ్లడం, తల్లి రాధ ఆయనకు సహకరిస్తుండడం.. రోజంతా తల్లిదండ్రులకు కష్టపడుతుండడాన్ని చిన్నతనం నుంచే కళ్లారా చూశామని గోపీకృష్ణ, మనోహర్ గోపి తెలిపారు. అంతేకాక మంచిగా చదివి పెద్ద ఉద్యోగాలు సాధించాలని తల్లిదండ్రులు నింపిన స్ఫూర్తితో కష్టపడడంతోనే ఫలితం వచ్చిందని వెల్లడించారు. ఇక తాత భీమనబోయిన పెద్ద నారాయణ సైతం ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కష్టాన్ని నమ్ముకుని పట్టుదలతో పనిచేసే తత్వాన్ని నేర్పించారని గుర్తుచేసుకున్నారు.
ప్రభుత్వ కొలువుల్లో ఇద్దరు కుమారులు

తల్లిదండ్రులే స్ఫూర్తిప్రదాతలు