
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భూమి రాసిస్తేనే పెళ్లి
తాళి కట్టే సమయాన నిలిచిన వివాహం
కూసుమంచి: తనకు కట్నంగా ఇస్తానన్న భూమిని బాండ్ పేపర్‌పై రాసిస్తేనే తాళి కడతానని వరుడు పట్టుబడటంతో పీటలమీద పెళ్లి నిలిచిపోయిన ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని రాజుపేట గ్రామానికి చెందిన యువకుడికి వెంకట్రాంపురం గ్రామానికి చెందిన తన బంధువుల యువతితో వివాహం నిశ్చయమైంది. బుధవారం ఏపీలోని ఓ దేవాలయంలో వివాహం జరిపించేందుకు వెళ్లారు. వరుడు తాళికట్టే సమయాన తనకు కట్నంగా ఇస్తానన్న భూమిని ఇప్పుడే బాండ్ పేపర్‌పై రాసి ఇవ్వాలని, అలా అయితేనే తాళి కడతానని పట్టుబట్టాడు. ఇరు వర్గాల వాగ్వాదం అనంతరం వరుడు కల్యాణ మండపం నుంచి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేమీ లేక వధువు తరఫువారు అక్కడి స్థానిక పోలీసులను ఆశ్రయించగా వారి సూచనతో గురువారం కూసుమంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.