● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: నర్సరీల్లో పెంచుతున్న మొక్కల సంరక్షణలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించొద్దని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని బూర్గుడ గ్రామ పంచాయతీలోని నర్సరీని మంగళవారం పరిశీలించారు. పంచాయతీ నిర్వహణ రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో మొక్కల పెంపకంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ నీటిని అందించాలన్నారు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండు రోజుల్లో నివేదిక అందించాలని ఏపీవోను ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం 25 శాతం రాయితీ ప్రకటించిందని తెలిపారు. పంచాయతీలో 78 మంది దరఖాస్తుదారుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా నగదు చెల్లించారని తెలిపారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో ఉమర్, ఎంపీవో మౌనిక, ఏపీవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి శ్రీలత, కారోబార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.