ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. నిర్భయంగా పరీక్షలు రాస్తేనే ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. గతంతో పోలిస్తే పరీక్షల తీరులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని, విద్యార్థులు వీటిని గుర్తించాలని సూచించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లపై బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
సాక్షి: మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి వసతులు కల్పించారు?
డీఈవో: వేసవి నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమయ్యాం. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రతీ కేంద్రం వద్ద వైద్యసిబ్బంది ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులతో సిద్ధంగా ఉంటారు.
సాక్షి: జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.. ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు?
డీఈవో: జిల్లాలోని 172 ఉన్నత పాఠశాలల్లో మొత్తం 6,421 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 2,908 మంది, బాలికలు 3513 మంది ఉన్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెట్లు 36 మంది, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు 36 మంది, సీ సెంటర్ కస్టోడియన్లు ముగ్గురు, ఇన్విజిలేటర్లు 432 మందిని నియమించాం. అలాగే మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి.
సాక్షి: గతేడాది ఫలితాల్లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలో 30వ స్థానంలో నిలిచింది.. ఈ ఏడాది మెరుగైన ఫలితాలకు ఎలాంటి చర్యలు చేపట్టారు?
డీఈవో: కొన్నేళ్లుగా పదో తరగతి వార్షిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. ఈ సారి మాత్రం ఉత్తమ ఫలితాలు సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నాం. డిసెంబర్‌లోనే సిలబస్ పూర్తి చేయించి.. విద్యార్థులతో రివిజన్ చేయించాం. 45 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేసి రోజూ పరీక్షలు నిర్వహిస్తూ ఫలితాలు విశ్లేషించాం. ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాస్‌లు నిర్వహించాం. పరీక్షల భయం పోగొట్టేందుకు ప్రేరణ తరగతులు సైతం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో జిల్లా టాప్ 10లో ఉంటుందని ఆశాభావంతో ఉన్నాం.
సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు..
డీఈవో: విద్యార్థులు తమ కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే చూసుకోవాలి. సెల్‌ఫోన్లు, టీవీలకు పూర్తిగా దూరంగా ఉండాలి. సమయాన్ని వృథా చేయొద్దు. సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు పరీక్షలు పూర్తయ్యే వరకు పిల్లలకు సహకరించాలి.
‘పది’ విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి
జిల్లాలో 36 కేంద్రాలు ఏర్పాటు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈవో యాదయ్య
సాక్షి: ఈ విద్యా సంవత్సరంలో పరీక్ష విధానంలో వచ్చిన మార్పులు ఏంటి?
డీఈవో: 2024– 25 విద్యా సంవత్సరంలో విద్యాశాఖ కొత్త నిర్ణయాలు అమలు చేయనుంది. ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు 24 పేజీలతో కూడిన జవాబు పత్రం(అన్సర్‌షీట్) ఇస్తారు. గతంలో నాలుగు పేజీలతో కూడిన బుక్‌లెట్ ఇచ్చేవారు. నాలుగు పేజీలు రాసిన తర్వాత విద్యార్థులు అవసరానికి అనుగుణంగా రెండు పేజీలతో కూడిన జవాబు పత్రాలు ఇచ్చేవారు. పిల్ల ల సమయం వృథా కాకుండా ఈసారి 24 పేజీలతో బుక్‌లెట్ అందజేస్తున్నాం.
సాక్షి: పరీక్షల సమయంలో ఎలాంటి మినహాయింపులు ఉన్నాయి?
డీఈవో: పరీక్ష సమయం కంటే 30 నిమి షాలు ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకో వాలి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుండగా, విద్యార్థులను ఉ దయం 8:30 నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయంలో ఐదు నిమి షాలు సడలింపు ఇచ్చారు. ఉదయం 9:35గంటల తర్వాత అనుమతి ఉండదు.
ఒత్తిడికి లోనుకావొద్దు