● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: దివ్యాంగ విద్యార్థులు సహాయ ఉపకరణాలను వినియోగించుకోవా లని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, స్టడీ చైర్లు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అలింకో సంస్థ జిల్లాలోని అన్ని పాఠశాలలను సందర్శించి 136 మంది దివ్యాంగులను గుర్తించిందన్నారు. వీరికి అవసరమైన సహాయ ఉపకరణాలు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అంగవైకల్యం కలిగిన వారు తమ పనులు స్వయంగా చేసుకోవడానికి ఈ ఉపకరణాలు దోహదపడతాయని తెలిపారు. దివ్యాంగులపై చిన్నచూపు చూడకుండా వారిని గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో అలింకో సంస్థ ఫైనాన్షియల్ అధికారి దేవాజీ, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, ఎంఈవో సుభాష్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.