ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తిచేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మండలంలోని నవేగాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పనులు చేపట్టని లబ్ధిదారులతో మాట్లాడాలని హౌసింగ్ అధికారులకు సూచించారు. నిర్మాణ దశలోని ఇళ్లను పూర్తిచేయడంపై దృష్టి సారించాలన్నారు. వర్షాకాలం ప్రారంభంలోగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు పూర్తిచేయాలని సూచించారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మిషన్ భగీరథ నీరందని ప్రాంతాల్లో ప్రత్యామ్యాయ మార్గాల ద్వారా తాగునీటిని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పైపులైన్ల లీకేజీ, బోరు బావుల మరమ్మతులు పూర్తిచేయాలన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించాలి
అనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31లోగా అర్హులు ఈ పథకం సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో డీపీవో భిక్షపతి, ఎంపీడీవో శంకరమ్మ, ఎంపీవో వాసుదేవ్, హౌసింగ్ డీఈ వేణుగోపాల్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
రుణ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలి
ఆసిఫాబాద్: జిల్లాలో సీ్త్రనిధి రుణ బకాయిల వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి సహాయ ప్రాజెక్టు మేనేజర్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో అందించిన రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించామని పేర్కొన్నారు. రుణగ్రహీతలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి గడువులోగా వందశాతం రుణాలు వసూలు చేయాలన్నారు. సమావేశంలో అదనపు డీఆర్‌డీవో రామకృష్ణ, రిసోర్స్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
Comments
Please login to add a commentAdd a comment