కాగజ్‌నగర్‌రూరల్: గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన తమకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు గురువారం కాగజ్‌నగర్ ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు– మన బడి, సీసీరోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు నిర్మించామని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికల కోసం రైతుల వద్ద తీసుకున్న పట్టా భూములకు బదులుగా ప్రభుత్వం నుంచి భూమి ఇస్తామని అధికారులు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికీ సదరు రైతులకు ప్రభుత్వ భూములు కేటాయించలేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.