
@ రూ.307
‘ఉపాధి’ కూలి
● స్వల్పంగా పెరిగిన వేతనం ● రేపటి నుంచి అమలు ● గిట్టుబాటు కావడం లేదని ఈజీఎస్ కూలీల అవేదన ● అదనపు భత్యాలు పునరుద్ధరించాలని వినతి
గోలేటిలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు
కూలీల్లో అసంతృప్తి..
మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో సమూల మార్పులు చేస్తోంది. గతంలో పనుల నిర్వహణకు ఉన్న సాఫ్ట్‌వేర్‌ను తొలగించి దాని స్థానంలో ఎన్‌ఎంఎంఎస్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. నిబంధనలు కఠినతరం చేశారు. మూడేళ్ల క్రితం వరకు అమలులో ఉన్న పాత సాఫ్ట్‌వేర్‌లో కూలితోపాటు అదనపుభత్యాలు చెల్లించేవారు. అంటే వేసవిలో కూలీలను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పనికి కూలితోపాటు 20 నుంచి 35 శాతం వరకు అదనంగా వేసవి భత్యం పేరుతో అందించేవారు. అలాగే కూలీలు ఉండే గ్రామం నుంచి పని ప్రదేశం ఐదు కిలోమీటర్లకు మించి ఉంటే కిలోమీటర్‌కు కొంత జమ చేసేవారు. పార, గడ్డపార వినియోగించినందుకు అదనపు భత్యం చెల్లించేవారు. గతంలో గడ్డపారాలు కూడా ప్రభుత్వమే ఉచితంగా అందించేది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చెల్లింపులు లేకపోవడంపై కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది గరిష్ట వేతనం రూ.300 ఉన్న సగటు కూలి కేవలం రూ.214 మాత్రమే అందింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ.307కు పెంచినా పెద్దగా ప్రయోజనం ఉండదని వారు చెబుతున్నారు. గిట్టుబాటు కాకున్నా వేసవిలో ఎలాంటి పనులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధిహామీ పనులకు వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిర్యాణి(ఆసిఫాబాద్): వలసలు నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం.. ప్రతీ ఆర్థిక సంవత్సరం కూలీల వేతనాల్లో సవరణలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. 2025– 26 ఆర్థిక సంవత్సరం నుంచి తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట వేతనం రూ.307 చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1.23 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. అందులో 2.43 లక్షల మంది కూలీలుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే ఇందులో 91 వేల జాబ్‌కార్డులు మాత్రమే యాక్టివ్‌గా ఉండగా, 1.70 లక్షల కూలీలు నిత్యం పనులకు వెళ్తున్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 44,33,227 పనిదినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం రూ. 132.99 కోట్ల కూలీల వేతనం కోసం ఖర్చు చేయనున్నారు. ఈజీఎస్ జాబ్‌కార్డు కలిగిన వారికి చెరువులు, కుంటలు, బావుల పూడికతీత, పంచాయతీల్లో నర్సరీల నిర్వహణ, మొక్కలు నాటడం, సంరక్షించడం, వ్యవసాయ భూముల చదును.. ఇతర పనులను కల్పిస్తున్నారు
పెంపు ఇలా..
ఉపాధిహామీ పథకం ప్రారంభంలో కూలీలకు గరిష్ట వేతనంగా రూ.87.50 చెల్లించారు. ప్రతీ ఏడాది ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఈ వేతనాలను సవరిస్తుంది. 2024– 25 సంవత్సరంలో రూ.300 చెల్లించారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి మరో ఏడు రూపాయలు పెంచింది. దీంతో ఉపాధి కూలీలకు గరిష్ట వేతనం రూ.307 మారింది. ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో చేపట్టే పనులకు పెరిగిన వేతనం వర్తింపజేయనున్నారు.
రూ.400 చెల్లించాలి
ఉపాధిహామీ కూలీలకు కనీస వేతనం రూ.400 చెల్లించాలి. అదనపు భత్యాలు ప్రభుత్వం తొలగించడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కుట్రలు పన్నుతోంది. ఇందులో భాగంగానే మార్పులు చేస్తున్నారు. కూలీలకు గిట్టుబాటయ్యేలా కూలి పెంచేవరకూ పోరాటాలు చేస్తాం.
– రాయిల్ల నర్సయ్య,
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు
గిట్టుబాటు కావడం లేదు
ప్రభుత్వం ఉపాధిహామీ కూలీలకు చెల్లించే వేతనం గిట్టుబాటు కాలేదు. ఈ సంవత్సరం నుంచి అయినా వేతనాలు ఎక్కువ పెంచుతారని ఆశపడ్డాం. కానీ కేవలం రూ.7 మాత్రమే పెంచారు. కూలీల వేతనాలు పెంచకపోయినా గతంలో మాదిరిగా అదనపు భత్యాలైనా అందించాలి. వేరే పనులు లేకపోవడంతో ఉపాధి పనులకు వెళ్తున్నాం.
– మహదేవుని విజయ,
ఉపాధి కూలి, గోలేటి, మం.రెబ్బెన

@ రూ.307

@ రూ.307