
సన్నబియ్యంతో పేదల జీవితంలో సంతోషం
ఆసిఫాబాద్‌రూరల్: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో ప్రజల జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం ఆర్‌ఆర్ కాలనీకి చెందిన తాక్సండే శంకర్ ఇంట్లో శనివారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 314 రేషన్ దుకాణాల ద్వారా మూడు వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అర్హులందరికీ సన్నబియ్యం అందజేస్తామని స్పష్టం చేశారు.