
వత్సవాయి(జగ్గయ్యపేట): మండలంలోని కొంగరమల్లయ్య గట్టు వద్ద ఉన్న టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో వత్సవాయి కేడీసీసీ బ్యాంకు మేనేజర్ మక్కమాల వెంకటరామన్(48) మృతి చెందారు. ఈ ప్రమాదం సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెంకటరామన్ ఉద్యోగరీత్యా విజయవాడ దగ్గర గొల్లపూడిలో నివాసం ఉంటున్నారు. ఎప్పటి మాదిరిగానే విధులకు హాజరమ్యేందుకు సోమవారం గొల్లపూడి నుంచి బస్సులో వత్సవాయి బయలుదేరారు.
నందిగామలో బస్సు దిగి బ్యాంకు రికవరీ కారులో డ్రైవర్‌తో కలిసి వత్సవాయి బయలుదేరారు. జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా సమీపంలో హైదరాబాద్ వైపు నుంచి ఓ కారు అతివేగంగా వచ్చి అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని రెండో మార్గంలో బ్యాంకు మేనేజర్ వెంకటరామన్ ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమా దంలో తీవ్రంగా గాయపడిన వెంకటరామన్ అక్కడికక్కడే మృతిచెందారు.
బ్యాంకు రివకరీ కారు డ్రైవర్ ఎం.శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడటంతో 108 వాహనంలో తొలుత జగ్గయ్యపేట ప్రభుత్వాస్పతికి తరలించి ప్రథమ చికిత్సచేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు నడుపు తున్న సూర్యనారాయణ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై ఎస్‌ఐ బి.అభిమన్యు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment