యర్రగొండపాలెం(ప్రకాశం): బడుగు జీవితాలపై మృత్యువు పంజా విసిరింది. చేతి వృత్తుల్లో కాయకష్టం చేసుకొని ఏ పూటకు ఆ పూట కుటుంబాలను నెట్టుకొస్తున్న ఐదుగురిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తాము పడిన కష్టానికి ఫలితాన్ని తీసుకొస్తామని ఇంట్లో చెప్పి సుదూర ప్రాంతానికి వెళ్లిన ఆ యువకులు విగతజీవులుగా మారిన ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెల్లవారు జామునే ఇంటికి వస్తామని చెప్పిన వారి జీవితాలు తెల్లారిపోయాయి.
మేదర పనులు చేసుకొని జీవించే ఐదుగురు యువకులు మృతి చెందడం విజయవాడలోని ప్రకాష్‌నగర్ కన్నీటి పర్యంతమైంది. మృతులందరూ వరుసకు బావ బావ మరుదులు. వారు కొబ్బరి ఆకులతో డెకరేషన్ మెటీరియల్ సప్లయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో డెకరేషన్ మెటీరియల్‌కు సంబంధించి తమకు రావాల్సిన డబ్బుల కోసం విజయవాడకు చెందిన తంబి రాజు, పిల్లి చంద్రశేఖర్, పిల్లి శ్రీను, గ్రంధి వెంకటసాయి, కొయన రాజు, భవాని శంకర్ ఈ నెల 27వ తేదీన కారులో అనంతపురం వెళ్లారు. మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నం కారులో విజయవాడకు తిరుగు పయనమయ్యారు.
రాత్రి 10.30 గంటల సమయంలో త్రిపురాంతకం ఊరి వెలుపల ఉన్న జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుంచి దిగుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. వాస్తవంగా హిందూపురం వెళ్లే ఈ బస్సు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి అక్కడి నుంచి నేరుగా వెళ్లాల్సి ఉంది. అయితే త్రిపురాంతకానికి సంబంధించిన ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో గమ్యానికి తొందరగా చేరుకోవటానికి డ్రైవర్ ఆ బస్సును ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైకి మళ్లించాడు. అనుకోకుండా ఎదురైన ఈ బస్సును కారు ఢీకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో తంబి రాజు, పిల్లి చంద్రశేఖర్, పిల్లి శ్రీను, గ్రంధి వెంకటసాయి, కొయన రాజు మృతి చెందగా, భవానీశంకర్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో తన అన్న వెంకటసాయి ఫోన్‌చేసి తెల్లారేలోపు ఇంటికి చేరుతామని చెప్పాడని, గంటన్నర తరువాత వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలిసిందని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశాడు. శివనాగేంద్ర, సింహాచలం కూడా ఆ కారులో ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే వేరే పనుల నిమిత్తం వారు అనంతపురం వెళ్లలేదు. దీంతో వారు ప్రమాదం బారినపడలేదు.
వీధిన పడిన చిన్న కుటుంబాలు
తంబి రాజు, పిల్లి చంద్రశేఖర్, పిల్లి శ్రీను, గ్రంధి వెంకటసాయి, కొయన రాజు మృతితో వారి కుటుంబాలు వీధినపడ్డాయి. తంబి రాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అన్నతోపాటు కాయకష్టం చేసుకొని జీవనం సాగిస్తు న్నాడు. అతనికి భార్య మంగ ఉంది. రాజు మృతితో మంగ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పల్లి చంద్రశేఖర్‌కు వివాహం కాలేదు. అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు జానకిరాం, శారద అతనిపై ఆధారపడి జీవిస్తున్నారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇకలేడని తెలుసుకున్న జానకిరాం, శారద తల్లడిల్లిపోతున్నారు.
పిల్లి శ్రీనుకు భార్య సత్య, ఎనిమిదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అతని తల్లిదండ్రులు మహేష్, లక్ష్మిలు సైతం వైర్ కుర్చీలు అల్లుకుంటూ వచ్చిన అరకొర డబ్బులతో కుమారుడి సంపాదనను తోడు చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. శ్రీను మృతితో కుటుంబ సభ్యులు భోరు మంటున్నారు. గ్రంధి వెంకటసాయికి భార్య విజయ, తల్లిదండ్రులు మహాలక్ష్మి, దాలయ్య ఉన్నారు. అల్లకం పనులు చేసుకుంటూ అతని కుటుంబం జీవనం సాగిస్తోంది. విజయవాడలోని ఆస్పత్రిలో మృతి చెందిన కొయన రాజుకు భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. తన భర్త ఇక రాడని తెలిసిన మృతుడి భార్య కన్నీటి పర్యంతమైంది. అతని రెండేళ్ల కుమారుడు కూడా నాన్న.. నాన్న అంటూ గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. వినుకొండ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న ఆరి భవానీ శంకర్‌కు వివాహం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment