
పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): వైద్య సహాయం నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే పేదల పట్ల సహృదయంతో వ్యవహరించి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంపై పలువురు చేసిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు కలెక్టర్ ఆయన చాంబర్‌లో జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించటమే ఎన్టీఆర్ వైద్యసేవ పథక లక్ష్యమన్నారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా సక్రమంగా నిర్వహించాలన్నారు. రోగులకు బిల్లుల భారం లేకుండా పూర్తి నగదు రహిత వైద్యం అందించేలా ఆస్పత్రుల యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం నిరాకరించకుండా పూర్తి వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం ఇటీవల పెండింగ్ బిల్లులను చెల్లించిన విషయాన్ని ఆస్పత్రుల యాజమాన్యానికి ఆయన గుర్తు చేశారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ ఎస్. శర్మిష్ట, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఎం. జయకుమార్, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎస్. సతీష్‌కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పక్కాగా పోలింగ్ కేంద్రాల పునర్‌వ్యవస్థీకరణ
మచిలీపట్నంలో పోలింగ్ కేంద్రాల పునర్‌వ్యవస్థీకరణ పక్కాగా చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో అధికారులతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో 205 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటిలో నగరంలో 135 ఉన్నట్లు తెలిపారు. అందులో ఒకే ఇంటి నంబరులో ఉన్న ఓటర్ల పేర్లు వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయని వారందరినీ ఒకే కేంద్రంలో ఉండేలా చేర్చాలన్నారు. ఇంటి నంబర్లు కూడా వరుసగా ఉండేలా ఓటర్ల జాబితా తయారు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను మచిలీపట్నం ఈఆర్వో పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. వచ్చే 15వ తేదీ మరలా సమావేశం నిర్వహించి ఆమోదం కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపిస్తామన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, ఇన్‌చార్జ్ ఆర్డీవో సీహెచ్ పద్మాదేవి, మునిసిపల్ కమిషనర్ బాపి రాజు, తహసీల్దార్లు మధుసూదనరావు, నాగ భూషణం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ