
శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను సన్మానిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు
పటమట(విజయవాడతూర్పు): పరిసరాలను శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యతని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. సోమవారం వీఎంసీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ పార్క్‌లో స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్, ఏపీడీఐసీ చైర్‌పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశీల, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బందరు కాలువ వెంబడి ఉన్న ఈ పార్క్‌ను తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో తీసుకురావటం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌లో భాగంగా 15 రోజులుగా స్వచ్ఛతా హీ సేవను దిగ్విజయంగా నిర్వహించారని, ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములు చేయటం హర్షణీయమని పేర్కొన్నారు. వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ నగరంలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో, గాంధీ హిల్, కెనాల్ బండ్స్ తదితర ప్రాంతాలలో 15 రోజుల నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. శనివారం గంట శ్రమదానం ద్వారా బస్‌స్టాండ్ ప్రాంతంలో శుభ్రం చేశామన్నారు. పలువురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లను, క్లాప్ సిబ్బందిని సన్మానించారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందించి, పారిశుద్ధ్య సిబ్బందికి రెయిన్ కోట్లు పంపిణీ చేశారు.