విజయవాడ: విజయవాడ సూర్యారావుపేటకు చెందిన యువకుడు పీజీ పూర్తి చేసి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంతగా వ్యాపారం చేయాలన్నది అతని కల. ‘ఇంట్లో కూర్చుని వ్యాపారం చేసి నెలనెలా రూ.లక్షల్లో సంపాదించొచ్చు’ అంటూ వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్ అతడిని ఆకట్టుకుంది. మెసేజ్ పంపిన వారితో చాటింగ్‌లో పరిచయం పెంచుకున్నాడు.
‘కొన్ని వెబ్ లింక్‌లు ఓపెన్ చేసి టాస్క్‌లు పూర్తి చేస్తే వెంటనే నగదు మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని’ సైబర్ నేరగాళ్లు అతడిని నమ్మించారు. రిజిస్ట్రేషన్‌కు కొంత నగదు చెల్లించి తొలి రెండు టాస్క్‌లు పూర్తి చేయగానే నగదు చెల్లించారు. ఆ తరువాత ఆ యువకుడు మరింత ఉత్సాహంతో కొత్త టాస్క్‌లు కొని పూర్తిచేశాక అతని వ్యాలెట్‌లో డబ్బు కనిపించినా విత్‌డ్రా కాకపోవడంతో సదరు వ్యక్తులను వాట్సాప్, టెలిగ్రాం చాటింగ్‌తో సంప్రదించాడు.
‘ఏదో ఎర్రర్ వస్తుంది.. మీరు టాస్క్‌లు పూర్తి చేయండి.. నగదు ఎక్కడికీ పోదు’ అని నేరగాళ్లు అతడిని భరోసా ఇచ్చారు. వారిని నమ్మి విడతల వారీగా రూ.80 లక్షలు చెల్లించాక మోసపోయానని గుర్తించిన ఆ యువకుడు విజయవాడ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, సైబర్ నేరస్తుల బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు.
మోసం చేసేది ఇలా..
సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఓటీపీతో మోసాలకు తోడు టెలిగ్రాం, వాట్సాప్‌ల సాయంతో ఉద్యోగ, వ్యాపార ప్రకటనతో నిరుద్యోగులు, చిరుద్యోగులు, మధ్యతరహా వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. పలు మార్గాల ద్వారా ప్రజల ఫోన్ నంబర్లను సేకరిస్తున్న నేరగాళ్లు ముందుగా వాట్సాప్/ టెలిగ్రాంలో ఆకర్షణీయమైన మెసేజ్ పంపుతారు. ఇంట్లో కూర్చుని, ఖాళీ సమయంలో పని చేస్తే కుటుంబ ఖర్చులౖకైనా వస్తాయన్న ఆశతో ఉన్న వారిని సైబర్‌నేరగాళ్లు చాటింగ్‌తో ముగ్గులోకి దింపుతారు.
చాటింగ్‌కు నంబర్లు కనిపించని టెలిగ్రాం యాప్‌నే నేరగాళ్లు ఉపయోగిస్తారు. వర్క్ ఎలా చెయ్యాలి, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూ ట్యూబ్ వీడియోలకు ఎలా లైక్‌లు కొట్టాలి, ఎలా షేర్ చేయాలి, ఎంత డబ్బు వస్తుంది.. అనే విషయాలను చాటింగ్‌లోనే వివరిస్తారు. మచ్చుకు కొన్ని వీడియోలను వాళ్లే పంపించి టాస్క్‌లు ఇస్తారు. నమ్మించేందుకు తొలి రోజే కొంత నగదును వారి బ్యాంక్ ఖాతాలో వేస్తారు.
రెండో రోజూ కొన్ని టాస్క్‌లు ఇచ్చి నగదు చెల్లిస్తారు. ఆ తరువాత నుంచి ఎక్కువ డబ్బు సంపాదించాలంటే పేరున్న కంపెనీలు ఆన్‌లైన్‌లో విక్రయించే వస్తువులకు రేటింగ్ ఇవ్వాలని, ఈ పని రిజిస్ట్రేషన్ కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. వెబ్‌సైట్ వాలెట్‌లో డిపాజిట్ సొమ్ము, ప్రాఫిట్, విత్‌డ్రా వివరాలు నిత్యం స్క్రీన్‌పై కనపడుతూనే ఉంటాయని నమ్మబలుకుతారు. సొమ్ము డిపాజిట్ చేసి టాస్క్‌లో దిగిన తరువాత.. చెల్లించిన సొమ్ముకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు కలిపి ప్రాఫిట్ బాక్స్‌లో చూపిస్తారు.
అయితే ఆ డబ్బు విత్‌డ్రా అవ్వదు. ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే మరి కొంత నగదు చెల్లించి రెండో టాస్క్ పూర్తి చేయాలని నమ్మిస్తారు. ప్రాఫిట్ బాక్స్‌లో ఉన్న నగదు కంటే డిపాజిట్ చేయాల్సిన నగదును తక్కువగానే చెబుతారు. ప్రాఫిట్ బాక్స్‌లో ఎక్కువగా ఉన్న నగదును చూసి ఆత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లకు బాధితులు నగదు చెల్లిస్తూనే ఉంటారు. అవతలి వ్యక్తి మాయగాడని తెలుసుకునే లోపు రూ.లక్షల్లో మోసపోతారు. ఆ తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
పెరుగుతున్న మోసాలు..
సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నెలకు పది నుంచి 15 కేసులు నమోదు చేస్తున్నాం. ఇటీవల ఓ యువతి రూ.10 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేసింది. సులువుగా డబ్బులు వస్తాయనే ఆశతోనే ప్రజలు మోస పోతున్నారు. 'ఉద్యోగం ఇచ్చే వ్యక్తి నెలకు జీతం ఇస్తాడే కానీ మన నుంచి ముందుగా డబ్బులు తీసుకోడనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి.' ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆదేశాలతో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్.రాజవర్ష, ఎస్‌ఐ, సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్, విజయవాడ
ఇవి చదవండి: కడపలో తల్లీతనయుల అదృశ్యం!
Comments
Please login to add a commentAdd a comment