
ఆరీబీకేల్లో ధాన్యం కొనుగోళ్లు (ఫైల్)
పెనుగంచిప్రోలు: రైతుల సేవలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) తరిస్తోంది. తన విధులను వ్యాపారంలా కాకుండా రైతులకు సేవ అందించటమే ధ్యేయంగా నిర్వర్తిస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం, సహకార రంగాలతో పాటు మార్కెట్ రంగంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో గొప్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు డీసీ ఎంఎస్ విశేష సేవలందిస్తోంది. గతంలో వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా కార్య కలాపాలు సాగించగా, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాల ద్వారా తన విధులను కొనసాగిస్తోంది. కృష్ణా జిల్లాలో 60, ఎన్టీఆర్ జిల్లాలో 40 ఆర్‌బీకేల్లో ధాన్యం, అపరాల కొనుగోలు, ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. ధాన్యాన్ని సివిల్ సప్లయీస్ శాఖ, అపరాలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు.
ఐదేళ్లలో డీసీఎంఎస్ వ్యాపారం ఇలా..
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ 2019 నుంచి 2024 వరకు ధాన్యం కొనుగోళ్ల ద్వారా రూ.1349.30 కోట్లకు పైగా వ్యాపారం చేసింది. రూ.56.30 కోట్లకు పైగా విలువైన అపరాలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. రూ.40.15 కోట్ల ఎరువులు, రూ.46.54 లక్షల విత్తనాలు, రూ.48.26 కోట్ల ప్రొవిజన్స్, రూ.3.61 కోట్ల పురుగు మందులు, రూ.6.28 కోట్ల స్టేషనరీ, రూ.1.75 కోట్ల ఆయిల్స్, రూ.5.96 కోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన పాత్రలు, ఫర్నిచర్, వ్యవసాయ, 42.21 లక్షల ఉద్యాన శాఖకు సంబంధించిన పరికరాలను విక్రయించింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,63,775 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించింది. క్వింటాకు రూ.2.203 చొప్పున రైతులకు చెల్లించింది.
ఇతర రంగాల్లో....
డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం, అపరాలపై కమీషన్ తీసుకుంటుండగా, ఇతర రంగాలపై చేసిన వ్యాపారంలో మార్జిన్ ఆర్జిస్తోంది. టీబీ రోగుల కోసం కనెక్ట్ టు ఆంధ్ర సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని కిట్ రూ.694 చొప్పున నెలకు 15 వేలు అందిస్తూ రూ.1.05 కోట్ల వ్యాపారం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏడు హాస్టళ్లకు సరుకులు సరఫరా చేస్తోంది. 2019లో కొత్తగా ఏర్పడిన గ్రామ/వార్డు సచివాలయాలకు ఆర్డర్‌పై ఫర్నిచర్ అందించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఫర్నిచర్, స్టేషనరీ కూడా అందిస్తూ ఆదాయం ఆర్జిస్తోంది. 2020 నుంచి నవంబర్ 23 వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల ద్వారా ప్రతి నెలా రూ.కోటి మేర వ్యాపారం చేసింది.
ఎన్నికలకు సంబంధించిన సామగ్రి
ఎన్నికలకు సంబంధించిన సామగ్రి, ఓటింగ్ కంపార్ట్‌మెంట్ల ఏర్పాట్లకు డీసీఎంఎస్ ఆర్డర్ తీసుకుంది. రైతులకు సేవలు అందించడమే కాకుండా ప్రభుత్వ సంస్థలకు అవసరమైన ఫర్నిచర్, స్టేషనరీ సరఫరా చేస్తోంది. అదనపు ఆదాయం కోసం పెట్రోలు బంకులు, జన ఔషధి దుకాణాలను ఏర్పాటు చేస్తోంది. తాజాగా జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద పెట్రోల్ బంక్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. విజయవాడలో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం ఏర్పాటు చేశారు.
రైతుల సేవలో డీసీఎంఎస్ ధాన్యం, అపరాల కొనుగోలు ప్రభుత్వ కార్యాలయాలకు ఫర్నిచర్, స్టేషనరీ సరఫరా అదనపు ఆదాయంపై ప్రత్యేక దృష్టి
అదనపు ఆదాయంపై దృష్టి
రైతులకు విశేష సేవలందించటంతో పాటు అదనపు ఆదాయంపై దృష్టి పెడుతున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మార్కెటింగ్ రంగం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. డీసీఎంఎస్ ద్వారా కొత్తగా గౌరవరం వద్ద జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడలో జన ఔషధి కేంద్రం ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందిస్తున్నాం.
– పడమటి స్నిగ్ధ, డీసీఎంఎస్ చైర్‌పర్సన్
ధాన్యం సొమ్ము చెల్లించాం
డీసీఎంఎస్ కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు పూర్తిగా నగదు చెల్లించాం. డీసీఎంఎస్ ద్వారా ఆర్‌బీకేల్లో ధాన్యం, మొక్కజొన్నలతో పాటు అపరాలు కొనుగోలు చేస్తున్నాం. రైతులకు మేలు చేయటమే ప్రధాన విధిగా సేవలు అందిస్తున్నాం. రైతులకు ధాన్యం సేకరణకు సంబంధించి సంచులు, హమాలీ చార్జీలు, రవాణా ఖర్చులు ప్రభుత్వమే ఇచ్చింది.
– గింజుపల్లి రవికుమార్,
డీసీఎంఎస్ డైరెక్టర్, నవాబుపేట

