
శ్రీరాముడి కల్యాణం.. పల్లెకు పేరంటం
కొటికలపూడి(ఇబ్రహీంపట్నం): కొటికలపూడిలో రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం చేశారు. సుమారు వందేళ్ల క్రితం బ్రిటిష్ కాలం నుంచి దళిత సామాజిక వర్గం వారు ఇక్కడి రామాలయంలో ఏటా వైభవంగా కల్యాణం చేస్తున్నారు. నాడు పూరిపాకలో పూజలు అందుకున్న స్వామికి ప్రస్తుతం చిన్న ఆలయాన్ని భక్తులు నిర్మించారు. స్వామివారిని ఆరాధ్యదైవంగా కొలుస్తూ పూజలు చేస్తారు. అనాదిగా ఇక్కడ దళిత పూజారులు పూజలు, కల్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఐదుగురు కమిటీ పెద్దలతో..
ఐదుగురు కమిటీ పెద్దలు.. కుల కట్టుబాట్లతో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు చెక్కభజనలు, కోలాటాలు, కృష్ణానదిలో పుణ్యస్నానాలు, స్వామివారి పూజా స్తంభం, గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం ఆచారంగా వస్తోంది. కారం పూడిలోని మాచర్ల చెన్నకేశవస్వామి ఆచారాల మాదిరిగా ఇక్కడ పూజలు చేయడం గమనార్హం.
‘నవమి’కి మూడు రోజుల ముందు నుంచి..
నవమి పండుగకు మూడు రోజుల ముందుగా ఉపవాసం ఉన్న భక్తులు శ్రీరామనవమి రోజు పదునైన కత్తులతో స్వామి వారికి సేవలు చేస్తారు. అయినా శరీరంపై ఎటువంటి గాయాలు కాకపోవడం వారి భక్తికి నిదర్శనంగా భావిస్తారు. స్వామివార్ల కల్యాణానికి పెళ్లికుమార్తె (సీతాదేవి) తరఫున దాసరి వంశీయులు, పెళ్లి కుమారుడు(రాములవారు)కి గోసుల వంశీయులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తుంటారు.
స్వామివారి చిత్రపటానికి కల్యాణం
అనాదిగా ఇక్కడ ఆలయ ప్రతిష్ట, స్వామివార్ల ప్రతిష్ట జరగకపోవడంతో స్వామివార్ల చిత్రపటానికి కల్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీపారాధన స్తంభాన్నే స్వామివారిగా భావించి ఇంటింటికీ ఊరేగిస్తారు. మూడు రోజుల పాటు ఊరేగింపు జరుగుతుంది. భక్తులు స్వామి వారికి నూతన వస్త్రాలు, కానుకలు, వ్యవసాయ పంటలు అందజేసి మొక్కలు చెల్లించుకుంటారు. కల్యాణం అనంతరం సుమారు 700 కుటుంబాలకు అన్నదానం చేస్తారు.
క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు
పండగకు ముందు మూడురోజుల పాటు క్రీడా పోటీలు, వివిధ సాంస్కృతిక (సాంఘిక, జానపద నాటికలు) కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏటా మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించేవారు. ఈ సంవత్సరం రాష్ట్రస్థాయి వాలీబాల్‌పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ ఆడపిల్లలకు ఆగ్రామ యువకులతోనే ఎక్కువగా వివాహాలు జరుగుతాయి. పండగ తర్వాతే గ్రామంలో వివాహాలు చేస్తారు. గ్రామంలోని వీధులు, రామాలయానికి విద్యుత్ దీపాలంకరణ చేశారు.
కొటికలపూడిలో రామాలయం ముస్తాబు విద్యుత్ దీపాలంకరణ దీపారాధన స్తంభంతో ఊరేగింపు