
ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు నిషేధం అమలు
మచిలీపట్నంఅర్బన్/నాగాయలంక: సముద్ర జలాల్లో చేపల వేటకు మత్స్యకారులు లంగరు వేయనున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. ఈ సమయంలో మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లు, మోటారు బోట్లతో సముద్రంలోకి వెళ్లడం నిషేధం. ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
వేట నిషేధ భృతి ఎక్కడ
2023–24లో వేట నిషేధ భృతి కింద బందరు, దివిసీమ తీరప్రాంతాల్లో 12,748 మంది మత్స్యకారులను అర్హులుగా ప్రతిపాదించారు. వేట నిషేధ భృతి కింద 12,151 మంది బ్యాంక్ ఖాతాల్లోకి వైఎస్సార్ సీపీ హయంలో రూ.10 వేలు చొప్పున నేరుగా రూ12.15 కోట్లు జమచేశారు. 2024–25 వేట నిషేధ భృతి క్రింద 12,809 మంది మత్స్యకారులను గుర్తించారు. సుమారు 12.89 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. గతేడాది ఎన్నికల కోడ్ రావడంతో భృతి అందలేదు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు వేట నిషేధభృతి రూ 20 వేలు ఇస్తామంటూ వాగ్దానాలు చేసింది. ఇప్పటివరకు గతేడాది భృతి మంజూరవకపోవడం మత్స్యకారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
తీరానికి చేరుకుంటున్న బోట్లు
రెండునెలల విరామానికి బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం సముద్రంలో 61 రోజుల పాటు వేట నిషేధం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. వేట విరామాన్ని ఉల్లంఘించిన వారి బోట్లను సీజ్ చేయడమేగాక సంక్షేమ పథకాలు కట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో..
ఆర్బీకేల్లో పనిచేసే గ్రామ మధ్య సహాయకుడితో పాటు వలంటీర్ సాగరమిత్రలతో ఏర్పాటు చేసిన బృందాలతో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టేవారు. తీరంలో లంగరేసిన బోట్లను ఈ బృందాలు పరిశీలిస్తాయి. గ్రామ సచివాలయ డిపార్ట్‌మెంట్ రూపొందించే సాఫ్ట్‌వేర్‌లో అవసరమైనా డాక్యు మెంట్లను అప్లోడ్ చేసేవారు. వెరిఫికేషన్ తర్వాత జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శించేవారు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఈ మొత్తం ప్రక్రియ ఏప్రిల్ ఆఖరులోగా పూర్తి చేసి మే నెలలో మత్స్యకారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తూ ప్రభుత్వం అండగా నిలిచింది.
తీరంలో నిలిపి ఉన్న బోట్లు
సముద్రంలో వేట నిషేధం
వేట బోట్లు ఒక్కొక్కటిగా తిరిగి తీరానికే ప్రయాణం
మత్స్యసంపద పునరుత్పత్తికి ఏటా నిషేధం
వైఎస్సార్ సీపీ హయాంలో గంగపుత్రులకు భరోసా
గతేడాది వేట నిషేధ భృతి మంజూరులో కూటమి ప్రభుత్వ అలసత్వం
భృతిని అందించాలి
గత ఏడాది భృతి మాకు రాలేదు. ఎదురుచూస్తూ రోజులు గడిపాం. బతుకే ఆగినట్టుగా అనిపించింది. ఈసారి అయినా ముందుగానే ప్రభుత్వం స్పందించి భృతిగా ఇస్తామన్న రూ.20 వేలు అందిస్తే బాగుంటుంది.
–పొనాల నాగలక్ష్మణరావు (తాతయ్య), మత్స్యకారుడు పల్లెతాళ్లపాలెం, మచిలీపట్నం
ఎటువంటి ఆదేశాలు లేవు
సముద్రంలో వేట నిషేధంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధ కాలంలో ఇచ్చే భృతికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదు. ఆదేశాలు అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం.
–అయ్య నాగరాజు, జాయింట్ డైరెక్టర్ మత్స్యశాఖ, మచిలీపట్నం

ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు నిషేధం అమలు