
నేలరాలిన ఆశలు
● పురుగులు, తెగుళ్లతో యాభై శాతమే కాపు ● పెనుగాలులకు సగానికి పైగా రాలిన మామిడి కాయలు ● ప్రీమియం అధికమవడంతో బీమాపై ఆసక్తి చూపని రైతులు ● ఎన్టీఆర్ జిల్లాలో బీమా తీసుకున్న రైతులు కేవలం 279 మంది ● ఉచిత బీమా కోరుతున్న రైతులు
జి.కొండూరు: మామిడి రైతులకు ఈ ఏడాది కాలం కలిసి రాలేదు. పూత రావడమే ఆలస్యంగా వస్తే పురుగులు, తెగుళ్లు, వాతావరణంలో మార్పుల కారణంగా యాభై శాతమే కాపు నిలిచింది. సగం పంటతో ఖర్చులైనా వస్తాయనుకుంటే పెనుగాలులు రైతుల ఆశల మీద నీళ్లు చల్లాయి. కాపు నిలిచిన సగంలో మరో సగం కాయలు నేల రాలాయి. ప్రకృతి వైపరీత్యాలలో ఆదుకునేందుకు గతేడాది కేంద్ర, రాష్ట్ర, రైతు భాగస్వామ్యంతో మామిడిలో బీమా పథకాన్ని తీసుకొచ్చారు. అయితే రైతు వాటా ప్రీమియం అధికమవడంతో రైతులు ఈ బీమాపై ఆసక్తి చూపలేదు. దీని వలన ఈ ఏడాది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వచ్చే ఏడాది నుంచైనా రైతు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి ఉచిత బీమాను అందిస్తే మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు.
98.4 హెక్టార్లకు మాత్రమే
ప్రకృతి వైపరీత్యాల నుంచి మామిడి రైతులను కాపాడేందుకు మామిడికి పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. 2024–25వ సంవత్సరానికి గానూ ఈ రబీ సీజన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో ప్రారంభించిన ఈ బీమా పథకం జిల్లాల వారీగా బీమా మొత్తం, ప్రీమియం చెల్లింపులను నిర్ణయించారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో బీమా మొత్తం ఎకరానికి రూ.41వేలుగా నిర్ణయించగా, రైతు నుంచి ప్రీమియంగా ఎకరానికి రూ.2,050 చెల్లించాల్సి ఉంది. రైతు వాటా ప్రీమియం అధికంగా ఉండడంతో జిల్లాలో కేవలం 279 మంది రైతులు 98.4 హెక్టార్లకు మాత్రమే బీమాను తీసుకున్నారు. అయితే ఈ బీమాను గతేడాది డిసెంబరు 15వ తేదీ నుంచి ఈ ఏడాది మే 31వ తేదీ మధ్య కాలంలో అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం, వాతావరణంలో వ్యత్యాసం, అధిక గాలి వేగం వంటి పరిమాణాల ఆధారంగా బీమాను చెల్లించేందుకు రూపకల్పన చేశారు. దీనిని మండల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నష్ట అంచనాలను లెక్కించి బీమా నిబంధనలకు సరిపోలినప్పుడు మాత్రమే బీమా సొమ్మును రైతుకు అందజేస్తారు.
50వేల టన్నులు కూడా కష్టమే
ఈ ఏడాది ఎన్టీఆర్ జిల్లాలో మామిడి దిగుబడి గతేడాదితో పోలిస్తే సగం కూడా వచ్చే అవకాశం లేదని అంచనాలు వేస్తున్న క్రమంలో ఇటీవల పెనుగాలులతో వచ్చిన అకాల వర్షానికి దిగుబడి పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. గతేడాది జిల్లాలో లక్షా 76వేల టన్నుల వరకు దిగుబడి రాగా ఈ ఏడాది 50 వేల టన్నులు కూడా వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉచిత బీమా ఇస్తే మేలు
నాకు నాలుగు ఎకరాల మామిడి తోట ఉంది. ఈ ఏడాది పురుగులు, తెగుళ్లతో పూత రాలిపోయి సగం కాపు కూడా నిలవలేదు. సోమ వారం సాయంత్రం వీచిన పెనుగాలులకి కాపు సగానికి పైగా రాలిపోయింది. రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టాను తీవ్రంగా నష్టపోయాను. బీమా కోసం రైతు ప్రీమియం ఎకరానికి రూ.2వేలు అనడంతో కట్టలేకపోయాను. ప్రభుత్వమే ఉచిత బీమా ఇస్తే మాకు మేలు .
–వంగపల్లి నాగరాజు,
కొత్త నాగులూరు, రెడ్డిగూడెం మండలం
మామిడితో తీవ్రంగా నష్టపోయాను
నాకు ఐదు ఎకరాల మామిడి తోట ఉంది. రెండు ఎకరాలలో మాత్రమే కాపు నిలిచింది. సోమవారం సాయంత్రం వచ్చిన పెను గాలులకు ఉన్న కాయలు కూడా రాలిపోయాయి. ఎకరానికి రూ.40 వేలు పెట్టుబడి పెట్టాను. తీవ్రంగా నష్టపోయాను. వచ్చే సీజన్‌లో మామిడి తొలగించి ఆయిల్‌పామ్ సాగు చేద్దాం అని ఆలోచిస్తున్నా. బీమా కోసం రైతు వాటాను ప్రభుత్వమే చెల్లిస్తే మామిడి రైతుకు భరోసా ఏర్పడుతుంది.
–ఇల్లెందుల కిశోర్,
లక్ష్మీపురం, తిరువూరు మండలం

నేలరాలిన ఆశలు

నేలరాలిన ఆశలు