కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉద్యోగులందరూ ఈ నెల 26వ తేదీలోగా ‘కర్మయోగి భారత్’ ఆన్‌లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం పొందాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సీఎఫ్‌ఎంఎస్ గుర్తింపు సంఖ్య కలిగిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఆన్‌లైన్ ద్వారా వారి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో కర్మయోగి భారత్ ధ్రువీకరణపత్రం పొందాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. మొదట్లో సీనియర్ అధికారులు మాత్రమే ఈ శిక్షణను పొందారని, ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా సమర్థనీయ సేవలు అందించేందుకు ఉద్యోగులందరూ ఈ శిక్షణ పొందేలా చూడాలని తీర్మానం చేశామన్నారు. ఈ విషయంపై ప్రతి జిల్లా అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించి వారి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరితో ఈ నెల 26వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయించాలని కలెక్టర్ సూచించారు. ఈ శిక్షణలో మూడు కోర్సులు ఉంటాయని అందులో హార్ట్ ఇన్ గవర్నెన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ కోర్సులు ఉన్నాయన్నారు. ఈ మూడు కోర్సులకు సంబంధించి మూడు వీడియోలు మొదటి నుంచి చివరి వరకు చూసిన తరువాత వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనంతరం ఒక ధ్రువీకరణ పత్రం విడుదలవుతుందన్నారు. డీఆర్వో చంద్రశేఖరరావు, రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీనియర్ సలహాదారు వెంకటేశ్వరస్వామి, కలెక్టరేట్ ఏవో సీహెచ్ వీరాంజనేయప్రసాద్ పాల్గొన్నారు.