వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): బిజినెస్ లేక అల్లాడుతున్న వ్యాపారవర్గాలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ‘అడ్వాన్స్ ట్యాక్స్ కట్టండి ప్లీజ్!’ అంటూ ఒత్తిడి తీసుకురావడం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జీఎస్టీ విధానంలో అడ్వాన్స్ ట్యాక్స్ అనే పదానికి ఆస్కారం లేదు. ‘కూటమి’ అనధికారికంగా ఇలాంటి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొస్తోందంటూ వ్యాపారవర్గాలు మండిపడుతున్నాయి. వ్యాట్‌లో ఉన్న విధానాన్ని జీఎస్టీలో అమలు చేయాలనుకోవడం ఏంటని వ్యాపార సంఘాల నేతలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మౌఖిక ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో వాణిజ్య పన్నుల శాఖ ఒకటి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖకు మూడు డివిజన్లలో సుమారు 20 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఆదాయం అధికంగా ఉన్న సర్కిల్ కార్యాలయాల్లో అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లుకు అధికారులు ఇటీవల మౌఖిక ఆదేశాలిచ్చారు. ‘కూటమి’ పాలనలో జీఎస్టీ తగ్గిన విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం చివర మాసం కావడంతో సాధ్యమైనంత మేర అధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ పెరిగిందని చెప్పుకోవడానికి కూటమి ఇలాంటి ఎత్తుగడలకు దిగిందని వ్యాపార సంఘాల నేతలు చెబుతున్నారు. వ్యాపారాలు లేక జీఎస్టీ పడిపోతే లేని అమ్మకాలను ఎంత చూపించినా ప్రయోజనం ఏమిటంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఈ నెలలో అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా జీఎస్టీ పెంచినా వచ్చే నెల అది మళ్లీ భారీగా పడిపోతుంది కదా...? అంటూ ప్రశ్నిస్తున్నారు.
‘కూటమి’ తీరుతో దిగజారిన వ్యాపారాలు
‘కూటమి’ పాలక విధానాల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాలో వ్యాపారాలు పూర్తిగా దిగజారాయి. పశ్చిమ కృష్ణాలో నిర్మాణరంగానికి అవసరమైన సిమెంట్ ఇతర వస్తువుల అమ్మకాలతో పాటుగా తూర్పు కృష్ణాలో ఆటోమొబైల్ రంగంలోనూ అనుకున్న అమ్మకాలు వృద్ధి లేక రావాల్సిన పన్నులు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వ తీరుతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో వ్యాపారాలు బాగా తగ్గాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీంతో వ్యాపారాలను కొనసాగించే పరిస్థితులు లేవంటూ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి సమయంలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టండంటూ అధికారులు కోరటంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి నేతల నుంచి వ్యతిరేకత
కూటమి పార్టీల్లో ఒకటైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అడ్వాన్స్ ట్యాక్స్‌కు వ్యతిరేకంగా ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు లేఖ రాశారు. జీఎస్టీలో అడ్వాన్స్ ట్యాక్స్ అనే నిబంధన లేదని కానీ దాన్ని అమలు చేయాలని చూడటం వ్యాపారులను ఇబ్బందికి గురి చేయటమేనని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని చెబుతున్న ప్రభుత్వ విధానానికి సైతం ఇది తూట్లు పొడుస్తుందని ఆయన ఆ లేఖలో చెప్పారు. జిల్లాలోని వ్యాపార వర్గాలు సైతం సీఎం రమేష్ రాసిన లేఖను ఉదహరిస్తూ ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నాయి.
లేని నిబంధనలతో తిప్పలు
వ్యాపారులపై జీఎస్టీ అధికారుల ఒత్తిడి
ఆర్థిక సంవత్సరం ఆఖరు కావడంతో జీఎస్టీ పెంపునకు ఎత్తుగడ
వ్యాపారాలు తగ్గలేదని చెప్పుకోవడానికి ‘కూటమి’ తంటాలు
ఒకవైపు ప్రభుత్వ తీరుతో జీఎస్టీ పడిపోతుంటే ఆదాయం పెంచాలంటూ ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై తీవ్ర ఒత్తిడిపెడుతున్నారు. జీఎస్టీ పన్నుల విధానంలో అడ్వాన్స్ ట్యాక్స్ అనే నిబంధన లేదు. రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఇప్పటికి వ్యాట్ అమలవుతోంది. దీంతో ప్రభుత్వ పెద్దలు మిగిలిన జిల్లాల్లో జీఎస్టీ విధానంలోనూ అమలు చేసి ఈ నెలలో భారీగా ఆదాయాన్ని పెంచాలంటూ ఒత్తిడి తీసుకువస్తోంది. అధికారులపై తీవ్రమైన ఒత్తిడి పెట్టడంతో వారు కూడా ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారు.
రిటర్నులు వేయమంటున్నాం
అడ్వాన్స్ ట్యాక్స్ కాదు అడ్వాన్స్‌గా రిటర్నులు వేయమంటున్నాం. మేం ఎక్కడా అధికారికంగా అడ్వాన్స్ ట్యాక్స్‌పై మాట్లాడటం లేదు. ఈ నెలలో జరిగే వ్యాపారానికి సంబంధించి వ్యాపారులు వచ్చే నెల 11వ తేదీ లోపు అమ్మకాలను ఫైనల్ చేసి, 20వ తేదీ లోపు దానిని ఖరారు చేసి ట్యాక్స్ కడుతుంటారు. ఆర్థిక సంవత్సరం చివర కావటంతో ఈ నెలలోనే రిటర్నులను 31వ తేదీలోపు వేయమంటు న్నాం. అంతేగానీ ఏ వ్యాపారికి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలని నోటీసులు ఇవ్వలేదు.
–షేక్ జహీర్, డెప్యూటీ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ, విజయవాడ డివిజన్–1