కర్నూలు(రాజ్‌విహార్): ‘పవిత్ర మసీదులు, దర్గాల ఆస్తులు నేను కబ్జా చేసినట్లు నువ్వు ఆరోపించావు. అల్లాను నమ్మిన నేను అలాంటి పని చేయను. ఖురాన్‌పై ప్రమాణం చేస్తా! దమ్ముంటే నువ్వు నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి లేదంటే క్షమాపణ చెప్పాల’ని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు సవాల్ విసిరారు. యువగళం పాదయాత్రలో లోకేష్ తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తర్వాత ఆరోపణలు రుజువు చేయాలని లోకేష్‌ను కోరేందుకు ఉదయం 9:45 గంటలకు ఇంటి నుంచి పవిత్ర గ్రంధం ఖురాన్ పట్టుకుని ద్విచక్ర వాహనంపై పాతబస్తీలోని ఖూబ్‌సూరత్ మసీదుకు చేరుకున్నారు.
అక్కడ మసీదులో నమాజ్ చదివి ఖురాన్ పఠనం చేశారు. పాదయాత్రలో లోకేష్‌ను ప్రశ్నించేందుకు ఎమ్మెల్యే వచ్చారని తెలుసుకున్న నగర కార్పొరేటర్లు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు మసీదుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12:50 గంటలకు మసీదు నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే.. లోకేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన యాత్రకు ఎదురెళ్లారు. దీంతో స్థానిక పాతబస్తీలోని మాసుంబాషా దర్గా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకునే యత్నం చేయగా ఆయన నేలపై కూర్చున్నారు.
తర్వాత ఆయనను పోలీసులు వాహనంలో తరలిస్తుండగా వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. దమ్ముంటే అబద్దాల లోకేష్ బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే మీసం మెలేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరకు పోలీసులు ఎమ్మెల్యేను రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లగా అక్కడ స్టేషన్ మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. అరగంట తరువాత ఎమ్మెల్యేను ఆయన ఇంటికి తీసుకెళ్లి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు షాషావలి, జుబేర్, యూనుస్, రాజేశ్వరరెడ్డి, కృష్ణకాంత్, పార్టీ నాయకులు ఖాదర్‌బాషా, హకీమ్, ఇర్ఫాన్, ఖాజా, అక్బర్, పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment