
రేపు శ్రీశైల భ్రామరీకి కుంభోత్సవం
శ్రీశైలంటెంపుల్: లోక కల్యాణం కోసం శ్రీశైలంలో వెలసిన భ్రమరాంబాదేవికి మంగళవారం కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం అమ్మవారికి ఆలయ అర్చకులు ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమ పూజలు, జపపారాయణలను నిర్వహిస్తారు. అనంతరం భ్రమరాంబాదేవికి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలతో తొలి విడత సాత్వికబలి సమర్పిస్తారు. కుంభోత్సవంలో భాగంగానే హరిహరరాయగోపురం వద్ద ఉన్న మహిషాసురమర్థిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజలు జరిపించి సాత్వికబలి సమర్పిస్తారు. సాయంత్రం మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం జరిపించి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహ మండపం వద్ద అనాన్ని రాశిగా పోసి సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పిస్తాడు. రెండోవిడత సాత్వికబలిని సమర్పించిన తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి తొమ్మిది రకాల పిండివంటలతో మహా నివేదన చేస్తారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం, ఏకాంతసేవ, అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేశారు.