గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామంలో ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు గురువారం తెల్లవారుజామున పాము కాటుకు గురయ్యారు. వీరిలో శ్రీనివాసులు(10) అనే బాలుడు శుక్రవారం మృతి చెందాడు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. బైలుప్పల బీసీ కాలనీలో బుర్నా గోవింద్, చంద్రమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు దొరస్వామి, బాలకృష్ణ సంతానం.
వీరికి వివాహాలు అయినా ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉంటున్నారు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము ఇంట్లోకి ప్రవేశించి దొరస్వామి, అతని ఎనిమిది నెలల కుమారుడిని, అలాగే బాలకృష్ణ కుమారుడు శ్రీనివాసులును కాటు వేసింది. కుటుంబ సభ్యులు దొరస్వామి, ఎనిమిది నెలల బాలుడిని మాత్రమే పాము కాటు వేసిందని భావించి గురువారం తెల్లవారు జామున చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అయితే ఇంటి దగ్గరే ఉన్న శ్రీనివాసులు పరిస్థితి విషమించింది. గమనించిన కాలనీ వాసులు వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. దొరస్వామి పరిస్థితి కూడా ఆందోళన కరంగా ఉండటంతో ఎమ్మిగనూరును నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రి తరలించారు. ఎనిమిది నెలల బాలుడు క్షేమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment