క్యాన్సర్ ఉంది..డబ్బు కావాలంటూ సందేశాలు
ఫేస్ బుక్ ఖాతాతో బురిడీ కొట్టించిన మహిళ
రూ.1.20 కోట్లు సమర్పించుకున్న తెలంగాణ వ్యక్తి
వ్యవహారం బయటపడటంతో మహిళ ఆత్మహత్యాయత్నం
పత్తికొండ (తుగ్గలి): ఫేస్ బుక్ చాటింగ్ పరిచయంతో ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి పెద్ద మొత్తంలో డబ్బు కాజేసింది ఓ మహిళ. ఈ ఘటన పత్తికొండ మండలంలో చోటు చేసుకుంది. చక్రాళ్లకు చెందిన లావణ్య ఎమ్మిగనూరులో ఉన్న తన చెల్లెలు ఫొటో పెట్టి ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువుకు చెందిన సాయిలుతో చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లుగా నమ్మిస్తూ వచ్చింది. తర్వాత తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని, ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో సాయిలు విడతల వారీగా రూ.1.20 కోట్లు సమర్పించుకున్నాడు.
చివరకు తన భార్యను కూడా నమ్మించి డబ్బు కాజేసిందని బాధితుడు చెబుతున్నాడు. అనుమానం వచ్చిన సాయిలు పత్తికొండకు వచ్చి ఆరా తీసి మోసపోయానని తెలుసుకున్నాడు. డబ్బుల విషయమై పలుమార్లు పంచాయితీ జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరులో ఉన్న ఆస్తులు అమ్మి ఇస్తానని చెబుతూ కాలం వెళ్లదీసింది. ఎంతకీ డబ్బులు ఇవ్వక పోవడంతో నాలుగు రోజుల క్రితం పత్తికొండకు వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
మహిళ తండ్రి, మధ్యవర్తులు పంచాయితీ చేసి సమస్య పరిష్కరించుకుంటామని పోలీసులకు చెప్పారు. అయితే వ్యవహారం అంతటా దావణంలా వ్యాపించడంతో మనస్తాపానికి గురైన లావణ్య మంగళవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. ఈ విషయమై పట్టణ సీఐ జయన్నను సంప్రదించగా ఘటనకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment