విశ్రాంత ఇంజినీర్ సుబ్బరాయుడుకు ‘గాడిచర్ల పురస్కారం’
కర్నూలు కల్చరల్: నగరానికి చెందిన నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజినీర్ ఎం.సుబ్బరాయుడుకు 29వ ‘గాడిచర్ల పురస్కారం’ను ఆదివారం ఆయన స్వగృహంలో ప్రదానం చేశారు. ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు 66వ వర్ధంతిని పురష్కరించుకొని గాడిచర్ల ఫౌండేషన్, ఎగ్జిబిషన్ సొసైటీ, ఏపీ గ్రంథాలయ సంఘం, విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్న గాడిచర్ల పురస్కారాన్ని ఈఏడాది సుబ్బరాయుడుకు చల్లా కాంపౌండ్‌లోని ఆయన స్వగృహంలో అందజేశారు. అనంతరం క్లస్టర్ యూనివర్సిటీ పరిఽధిలోని కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని ప్రకాశం సభా భవనంలో గాడిచర్ల వర్ధంతి సభ జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాడిచర్ల చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్ మాట్లాడుతూ విజ్ఞాన వేత్త సాగు, తాగు నీటి కోసం శ్రమించిన సుబ్బరాయుడు పనిలో దైవాన్ని చూసే వారన్నారు. నీటిని పదిలం చేసే పనిలో వంద శాతం కృషి చేశారన్నారు. రాయలసీమకు సాగు, తాగు నీరు కోసం విశేషంగా శ్రమించారన్నారు. క్లస్టర్ యూనివర్సిటీ లైబ్రరీకి గాడిచర్ల హరిసర్వోత్తమ రావు పేరు పెడతామన్నారు. గాడిచర్ల ఫౌండేషన్, సాహితీ సదస్సు అధ్యక్షుడు కురాడి చంద్రశేఖర కల్కూర మాట్లాడుతూ కృష్ణా నదిపై సిద్ధేశ్వరం అలుగు, తుంగ భద్రపై గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి నదిపైన ఎత్తిపోతల పథకం కడితే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పిన దార్శనికుడు సుబ్బరాయుడని కొనియాడారు. క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, రాయలసీమ జల సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీఎస్ కుమార్, తెలుగు భాషా వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్‌ఆర్కే శర్మ మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీఎస్‌పీ బె బెటాలియన్ డీఎస్పీ మహబుబ్ బాషా, గ్రంఽథాయల సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, మధుర కవి ఎలమర్తి రమణయ్య మాట్లాడారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు దండెబోయిన పార్వతీ దేవి, డాక్టర్ రాధారాణి, చరిత్ర విభాగాధిపతి జయలక్ష్మి, ఉపన్యాసకులు విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment