ఉరుకుంద హుండీ ఆదాయం రూ.90.16లక్షలు | - | Sakshi
Sakshi News home page

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.90.16లక్షలు

Published Thu, Mar 6 2025 1:47 AM | Last Updated on Thu, Mar 6 2025 1:42 AM

ఉరుకు

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.90.16లక్షలు

కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం హుండీని బుధవారం స్థానిక కాలక్షేప మండపంలో లెక్కించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్‌ విజయరాజు, హుండీ పర్యవేక్షణ అధికారి వెంకటేశ్‌ ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు. 57రోజులకు సంబంధించి భక్తులు స్వామి వారికి నగదు రూపంలో రూ.90,16,666 సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వెండి 11కేజిల 20గ్రాములు, బంగారం 13 గ్రాములు వచ్చిందన్నారు.

8న జాతీయ లోక్‌ అదాలత్‌

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లోని కేసుల పరిష్కారానికి ఈనెల 8న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి.కబర్థి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్‌ పి.లీలా వెంకట శేషాద్రి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో న్యాయ స్థానాల్లో పెండింగ్‌ ఉండి రాజీ పడేందుకు సిద్ధంగా ఉన్న సివిల్‌, క్రిమినల్‌, ప్రీలిటిగేషన్‌ కేసులను పరిష్కరించుకోవాలని బాధితులకు సూచించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మహిళా ఉద్యోగులకు నేడు, రేపు ప్రత్యేక సెలవులు

కర్నూలు(అగ్రికల్చర్‌): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు ఈ నెల 6, 7 తేదీలను ప్రత్యేక సాధారణ సెలవులుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా తేదీల్లో మహిళా ఉద్యోగులకు ఆటలు పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించే 8వ తేదీ రెండవ శనివారం కావడంతో సెలవు వస్తుంది. ఇటీవల ఏపీఎన్‌జీవో అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కార్యవర్గం అధ్యక్షుడు వీసీహెచ్‌ వెంగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు ఈనెల 6, 7 తేదీలను ప్రత్యేక సాధారణ సెలవులుగా ప్రకటించాలని కోరారు. ఆ మేరకు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వెంగళ్‌రెడ్డితో పాటు అసోసియేషన్‌ కార్యదర్శి కేసీహెచ్‌ కృష్ణుడు, నగరశాఖ అధ్యక్షుడు ఎంసీ కాశన్న, ఉమన్‌ వింగ్‌ నేత చందన తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

దూదేకొండలో టమాట ప్రాసెసింగ్‌ యూనిట్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): పత్తికొండ మండలం దూదేకొండలో టమాట ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2.50 ఎకరాల్లో యూనిట్‌ ఏర్పాటుకు బుధవారం జీఓ విడుదల చేసింది. ఇందుకు కేంద్రం రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద రూ.8 కోట్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆపరేషన్‌ గ్రీన్‌ రూ.3 కోట్లు విడుదల చేయనుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పత్తికొండ మండలం హోసూరు వద్ద టమాట ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయతలపెట్టింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. పనులు కూడా మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పనులు నిలిచిపోయాయి. తాజాగా దూదేకొండలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంది.

ఫేక్‌ కాల్స్‌ నమ్మొద్దు

కర్నూలు(అర్బన్‌): మూడు చక్రాల వాహనాలు (స్కూటీ), ల్యాప్‌టాప్‌, ఇతర సహాయ పరికరాలు మంజూరు అయ్యాయని 9642076467, 6364506562, 6300090356 నంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను నమ్మొద్దని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ ఫాతిమా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సహా య పరికరాలు అందించాలంటే కొంత డబ్బు ఫోన్‌పే చేయాలని కొందరు దివ్యాంగులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి కాల్స్‌ వల్ల దివ్యాంగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ పరికరాల సమాచారం కోసం తమ కార్యాలయ ఫోన్‌ నంబర్‌ను 08518–277864ను సంప్రదించాలన్నారు.

రెగ్యులర్‌ సీఈగా కబీర్‌ బాషా

కర్నూలు (సిటీ): కర్నూలు ప్రాజెక్ట్స్‌ ఇన్‌చార్జ్‌ సీఈగా పనిచేస్తున్న షేక్‌ కబీర్‌ బాషాకు పదోన్నతి కల్పించి రెగ్యులర్‌ సీఈగా నియమించారు. ఈయన ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్‌–1 పర్యవేక్షక ఇంజినీర్‌గా పనిచేస్తూనే 2022 జులై 4వ తేదీ నుంచి ఇన్‌చార్జ్‌ సీఈగా పనిచేస్తున్నా రు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం పర్యవేక్షక ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎంఎల్‌వీ వరప్రసాద్‌ను తెలుగుగంగ తిరుపతి చీఫ్‌ ఇంజినీర్‌గా నియమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఉరుకుంద హుండీ ఆదాయం రూ.90.16లక్షలు  1
1/1

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.90.16లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement