సేవల జాప్యం.. తీసింది ప్రాణం
● బ్యాంక్ కార్యాలయ మెట్లు ఎక్కలేక
గర్భిణికి రక్తస్రావం
● ఖాతాలో పేరు మార్పునకు జాప్యం
● పురిటిలోనే మృతి చెందిన మగశిశువు
కోసిగి: బ్యాంకు సిబ్బంది కాలయాపనతో ఓ మహిళ పురిటిలోనే తన బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాల్సిన బ్యాంకుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రం కోసిగిలో 6వ వార్డులో నివాసం ఉంటున్న జాలిమంచి సురేష్ భార్య అంజలి నిండు గర్భిణి. ప్రసవం నిమిత్తం ఆమె పుట్టినిల్లు వందగల్లు గ్రామంలో ఉంటుంది. అయితే ఆమె బ్యాంక్ ఖాతా స్టేట్ బ్యాంక్‌లో ఉంది. పెళ్లియినా తర్వాత పుట్టింటి నుంచి మెట్టింటికి రావడంతో పేరు మార్పు చేసుకోవాల్సి ఉంది. పేరు మార్పు కోసం నెల రోజులుగా బ్యాంక్ అధికారులు కాలయాపన చేస్తూ తిప్పుతూ ఉన్నారు. ఈ బ్యాంక్ కార్యాలయం ఓ భవనంపై రెండో అంతస్తులో ఉండటంతో మెట్లు ఎక్కి దిగ లేక అవస్థలు పడుతుండేది. గురువారం ఆమె బ్యాంక్ మెట్లు ఎక్కి కొద్ది సేపటికే రక్త స్రావం కావడంతో వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి ఆటోలో కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 ఆంబులెన్స్‌లో ఆదోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కాగా అప్పటికే తల్లి పురిటిలోనే మగ బిడ్డ చనిపోయినట్లు నిర్ధారించడంతో అంజలి, ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వాపోయారు. కోసిగి స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయం రెండవ అంతస్తులో ఉండడంతో గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment