బీసీ, ఈబీసీలకు ఉచిత డీఎస్సీ శిక్షణ
కర్నూలు(అర్బన్): జిల్లాలోని బీసీ, ఈడబ్ల్యూఎస్(ఈబీసీ) అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ, సాధికారత అధికారి బి.కె.వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులన్నారు. శిక్షణకు ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తును స్వయంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందించాలన్నారు. దరఖాస్తుకు చివరి తేది, కోచింగ్ కాల వ్యవధి తదితర వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు.
లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
కర్నూలు(సెంట్రల్): పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్వో కార్యాలయం ఎదుట ఏపీజేఏసీ అమరావతి ఏర్పాటు చేసిన షీ బాక్సును కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులను బహిరంగంగా చెప్పలేని ఉద్యోగినులు షీ బాక్సుల్లో ఫిర్యాదు వేస్తే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగినులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిర్వాహకురాలు సింధు సుబ్రమణ్యం, ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు కేవై కృష్ణ, మహిళా విభాగం చైర్‌పర్సన్ సహెరాబాను, ఏపీఆర్‌ఎస్‌ఏ మహిళా విభాగం నాయకురాళ్లు శివపార్వతి, పద్మావతి పాల్గొన్నారు.
16న జెడ్పీ సర్వసభ్య సమావేశం
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 16న ఉదయం 11 గంటలకు జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా–పారిశుద్ధ్యం, వ్యవసాయం, జలవనరులు, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జెడ్పీ, ఎంపీపీ బడ్జెట్‌పై చర్చిస్తామన్నారు. అధ్యక్షుని అనుమతితో ఇతర అంశాలను చర్చించే అవకాశం ఉందని, ఈ సమాచారాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్లు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు.
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
కర్నూలు(సెంట్రల్): అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సుంకేసుల రోడ్డులోని ఎమ్మార్సీ కన్వెన్షన్ హాలులో శనివారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి కలెక్టర్ పి.రంజిత్‌బాషాతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment