బరితెగించిన టీడీపీ శ్రేణులు
కొలిమిగుండ్ల: టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తాజాగా ఓ భూమి విషయంలో కొలిమిగుండ్ల మండలం చింతలాయిపల్లెకు చెందిన నలుగురిపై దాడి చేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే.. చింతలాయిపల్లెలోని 144/1 సర్వే నెంబర్‌లో 9.72 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విషయంలో దూదేకుల రహంతుల్లా, అంకిరెడ్డిపల్లెకు చెందిన బత్తుల లక్ష్మన్న మధ్య చాలా రోజుల నుంచి వివాదముంది. దీనిపై కోర్టులో వ్యాజ్యం జరుగుతుంది. రహంతుల్లా సోదరులు ఆ భూమిలో చీని చెట్లు నాటుకున్నారు. ఫిబ్రవరి 28న అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి కొలతలు వేసి మూడు ఎకరాల భూమిని లక్ష్మన్నకు అప్పగించారు. జేసీబీ సాయంతో చింతలాయిపల్లెకు చేరుకున్న టీడీపీ శ్రేణులు దౌర్జన్యంగా చీనిచెట్లను తొలగించడంతో రహంతుల్లా కుటుంబానికి చెందిన మహిళలు అడ్డుపడ్డారు. ఇందుకు రెచ్చిపోయిన అధికారపార్టీ నాయకులు లక్ష్మన్న, రంగనాయకులు, సుబ్బులతో పాటు మరి కొంత మంది మహిళలు అని చూడకుండా అమీనాబీ, జైన్‌బీ, ఇమాంబీతో పాటు బాలిక హాసినిపై కట్టెలు, రాళ్లతో ఇష్టానుసారంగా దాడి చేసి గాయపర్చారు. క్షతగాత్రులను కుటుంబ సభ్యులు బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి క్షతగాత్రులను పరామర్శించి ఘటనపై ఆరాతీశారు. చింతలాయిపల్లెలో కొద్ది రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ నేత నీలం సంజీవకుమార్‌రెడ్డికి చెందిన 400 మునగ చెట్లను పూర్తిగా నేలమట్టం చేశారు. ఆకేసులో నిందితులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మంత్రి అండతోనే దాడులు
దౌర్జన్యంగా మహిళలపై దాడి
నలుగురికి గాయాలు
బనగానపల్లె రూరల్: బీసీ జనార్దన్‌రెడ్డి మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. మంత్రి అండతోనే ఆ పార్టీ నాయకులు చింతలాయిపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి చేశారన్నారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి బీసీ ప్రోద్బలంతో కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాధితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి కోర్టు వ్యాజ్యంలో ఉన్నటువంటి పొలాన్ని బత్తుల లక్ష్మన్న కుటుంబసభ్యులకు అప్పగించాలని ఒత్తిడికి గురిచేసినట్లు ఆరోపించారు. అంగీకరించకపోవడంతో చీని చెట్లను జేసీబీ సహాయంతో తొలగించడమే కాక దాడి చేశారన్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అన్ని విధాలుగా తాను అండగా ఉంటానన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ న్యాయవాది అబ్దుల్‌ఖైర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment