కర్నూలు కల్చరల్: సుప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ ఎంపీఎం రెడ్డి సేవలు చిరస్మరణీయమని అరుణ భారతి అధ్యక్షుడు బీసీ రాజారెడ్డి అన్నారు. సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం తెలుగు కళా స్రవంతి ఆఽధ్వర్యంలో డాక్టర్ ఎంపీఎం రెడ్డి సంస్మరణ సభను నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ రాజారెడ్డి మాట్లాడుతూ.. భారతీయ తొలి సముద్ర శాస్త్రవేత్తగా ఎదిగిన ఎంపీఎం రెడ్డి ఆదర్శనీయులు అన్నారు. ప్రపంచంలోని అన్ని సముద్రాలు సందర్శించి పరిశోధనలు చేశారని గుర్తు చేసుకున్నారు. సముద్ర శాస్త్రంపై ఈయన రాసిన పుస్తకాలను కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రచురించడం గర్వకారణమన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ రెడ్డి రచించిన సముద్ర శాస్త్ర గ్రంథాలే ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీల్లో సముద్ర శాస్త్ర, మత్య్స శాస్త్ర విద్యార్థులు పాఠ్యగ్రంథాలుగా చదువుకోవడం ఉమ్మడి కర్నూలు జిల్లాకు గర్వకారణమన్నారు. ఎంపీఎం రెడ్డి కూతురు మాలతి, కుమారుడు డాక్టర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి కెనడాలో ఉండి కూడా భారతీయ సంస్కృతికి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో తెలుగు కళా స్రవంతి అధ్యక్షుడు ఇనాయతుల్లా, సాహితీ స్రవంతి అధ్యక్షులు కెంగార మోహన్, కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, రచయిత గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, గజల్ గాయకుడు మహమ్మద్ మియ్యా, మద్దిలేటి యాదవ్ మాట్లాడారు. ఎంపీఎం రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.