కర్నూలు: జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రత్యేక పోలీసు బృందాలచే పెట్రోలింగ్ నిర్వహించి విద్యార్థులు గుంపులుగా చేరకుండా చర్యలు చేపట్టారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకుండా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమతించారు.
ఖరీఫ్ సీజన్‌కు
విత్తనాల కేటయింపు
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఖరీఫ్ సీజన్‌కు సబ్సిడీ విత్తనాలను కేటాయిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధరలు, సబ్సిడీలు మే నెలలో ఖరారు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ( ఏపీసీడ్స్) విత్తనాలను సరఫరా చేస్తుంది. కర్నూలు జిల్లాకు వేరుశనగ 13,804 క్వింటాళ్లు.. కందులు 892.5 క్వింటాళ్లు, మినుములు 25, పెసర 10, కొర్ర 70, దయంచా 154, పిల్లి పెసర 11 క్వింటాళ్ల ప్రకారం మొత్తం 14,955.61 క్వింటాళ్లు కేటాయించింది.
● నంద్యాల జిల్లాకు వేరుశనగ 3,063 క్వింటాళ్లు, దయంచ 3,023, సన్‌హెంప్ 5, పిల్లి పెసర 19, కందులు 2,550, మినుము 745, పెసర 20, కొర్ర 91, వరి 380 క్వింటాళ్ల ప్రకారం మొత్తం 9,896 క్వింటాళ్లు కేటాయించింది. రెండు జిల్లాలకు ఏపీ సీడ్స్ విత్తనాలు సరఫరా చేయనుంది.
నేటి నుంచి సుయతీంద్ర తీర్థుల సమారాధన
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి, నవ మంత్రాలయ రూపశిల్పిగా పేరుగాంచిన సుయతీంద్రతీర్థుల సమారాధన వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల గురువులైన సుయతీంద్రతీర్థుల 12వ సమారాధన వైభవంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా మంగళవారం పూర్వారాధన, బుధవారం మద్యారాధన, గురువారం ఉత్తరారాధన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతి రోజూ ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మద్యారాధన రోజు మహా పంచామృతాభిషేకం, స్వర్ణ రథోత్సవాలు జరపనున్నారు. పలువురు విద్వాన్‌లచే రోజూ ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపించనున్నారు.
పెద్దాసుపత్రిలో ఓపీ విభాగాల తనిఖీ
● విధుల్లో లేని ఇద్దరు వైద్యులకు మెమోలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు ఓపీ విభాగాలను సోమవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం, జనరల్ సర్జరీ విభాగాల తనిఖీ సమయంలో విధి నిర్వహణలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారికి మెమోలు జారీ చేసి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో రోగుల రద్దీ దృష్ట్యా అదనంగా మరో ఓపీ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు