ప్రభుత్వాసుపత్రుల్లో తగ్గిన ప్రసవాలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రుల్లో తగ్గిన ప్రసవాలు

Published Fri, Mar 21 2025 1:58 AM | Last Updated on Fri, Mar 21 2025 1:53 AM

ఈ ఆర్థిక సంవత్సరంలో

22.8 శాతానికే పరిమితం

సరైన సేవలు అందకపోవడమే

ప్రధాన కారణం

77 శాతం పైగా

ప్రయివేట్‌ ఆసుపత్రుల్లోనే..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో

మొక్కుబడి సేవలు

పరిస్థితి విషమిస్తేనే కర్నూలు

జీజీహెచ్‌కు తరలింపు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగం

పత్తికొండ నియోజకవర్గం: తుగ్గలి పీహెచ్‌సీ పరిధిలో 2024 జూన్‌ నుంచి 638 మంది గర్భిణిలను గుర్తించారు. వీరిలో 25 మంది మాత్రమే పీహెచ్‌సీలో డెలివరీ అయ్యారు. మరో 28 మందిని రెఫర్‌ చేశారు.

కోడుమూరు

నియోజకవర్గం: గూడూరు పీహెచ్‌సీ పరిధిలో మొత్తం 476 మంది గర్భిణిలను గుర్తించగా.. వీరిలో 67 మంది పీహెచ్‌సీలోనే డెలివరీ అయ్యారు. మరో ఆరుగురిని కర్నూలుకు రెఫర్‌ చేశారు.

ఆలూరు నియోజకవర్గం: మొలగవల్లి పీహెచ్‌సీ పరిధిలో మొత్తం 210 మంది గర్భిణిలను గుర్తించగా.. 8 మంది మాత్రమే పీహెచ్‌సీలో డెలివరీ చేయించుకున్నారు. 15 మందిని రెఫర్‌ చేశారు.

గత ఆర్థిక సంవత్సరంలో 45,040 మంది గర్భిణిలు రిజిష్టర్‌ అయ్యారు. ఇందులో 10,072 మంది(22.36శాతం) హైరిస్క్‌లో ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. ఇదే గత ప్రభుత్వంలో ప్రసవాల సంఖ్య ప్రభుత్వాసుపత్రుల్లో 60శాతం వరకు ఉండగా.. హైరిస్క్‌ గర్భిణిల శాతం కూడా 19లోపే. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం సన్నగిల్లడంతోనే గర్భిణిలు ప్రయివేట్‌ను ఆశ్రయిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

20,479

ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో

ప్రసవాల సంఖ్య

ప్రభుత్వ సర్వజన వైద్యశాల: కర్నూలు

ఏరియా ఆసుపత్రి: 1 (ఆదోని)

ఎంసీహెచ్‌ ఆసుపత్రి: 1

సీహెచ్‌సీలు: 5 పీహెచ్‌సీలు: 44

అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు: 28

జరిగిన ప్రసవాలు: 4,671 మంది

(22.80శాతం)

ప్రయివేట్‌ ఆసుపత్రులు: 120

జరిగిన ప్రసవాలు: 15,808

(77.19శాతం)

కర్నూలు(హాస్పిటల్‌): ప్రభుత్వాసుపత్రుల్లో సకాలంలో వైద్యులు ఉండకపోవడం.. ఉన్న సిబ్బంది నుంచి మాటల తూటాలు.. అరకొర వైద్య సేవలు.. సాయంత్రం దాటితే ఆయా ఆసుపత్రుల్లో ఎవ్వరూ కనిపించకపోవడం.. ఇదీ జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల తీరు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చక్కబెట్టిన సేవలను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోంది. ఇందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగ్గిన ప్రసవాల సంఖ్యే నిదర్శనం. గత ప్రభుత్వంలో 60 శాతం వరకున్న ప్రసవాలు.. ఇప్పుడు ముక్కుతూ మూలుగుతూ 25 శాతం మించకపోవడం గమనార్హం. అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది ఉన్నా ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయించడం క్రమంగా తగ్గుతోంది. మరీ ముఖ్యంగా కర్నూలు సర్వజన ప్రభుత్వాసుపత్రిలో అధునాతన కొత్త భవనంతో పాటు ప్రత్యేక వసతులతో కూడిన ఐసీయూ సేవలందిస్తోంది. ఉచితంగా రక్తం ఇచ్చేందుకు బ్లడ్‌ బ్యాంకు కూడా ఉంది. వైద్యులు, పీజీ విద్యార్థులు, నర్సుల సంఖ్య గణనీయంగా పెరిగినా పరిస్థితి విషమంగా ఉన్న గర్భిణిలు మాత్రమే ప్రసవానికి వస్తుండటం గమనార్హం.

ప్రైవేటు ఆసుపత్రుల్లో

76 శాతం ప్రసవాలు

జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) 20,479 ప్రసవాలు జరిగితే అందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో 15,808(77.19శాతం) ప్రసవాలు జరగడం గమనార్హం. గర్భం దాల్చినప్పటి నుంచి పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని గైనకాలజిస్టుల వద్ద గర్భిణిలు చికిత్స చేయించుకుంటున్నారు. ప్రసవానికి కూడా వారి సూచన మేరకు ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ వార్డులు, బాత్‌రూమ్‌లు శుభ్రంగా ఉండటం, నర్సింగ్‌ కేర్‌ బాగుండటం, వైద్యులు అందుబాటులో ఉండటం వల్ల ప్రయివేట్‌ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

అత్యవసరమైతేనే కర్నూలు జీజీహెచ్‌కు..

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగానికి ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో ప్రతిరోజూ 35 నుంచి 40 దాకా ప్రసవాలు జరిగేవి. ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు, ఎప్పుడూ పీజీల సేవలు, నర్సింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయని నమ్మి ఇతర ప్రాంతాల నుంచి సైతం ప్రసవానికి ఇక్కడికే వచ్చేవారు. కానీ ఆరోగ్యశ్రీ ప్రైవేటులోనూ వర్తిస్తుండటంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ 15 నుంచి 20 ప్రసవాలు మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

80 శాతం సిజేరియన్‌ కాన్పులే..

ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 80 శాతం సిజేరియన్‌ కాన్పులే ఉంటున్నాయి. గర్భిణిలు, కుటుంబసభ్యులు ప్రసవ వేదనకు తట్టుకోలేక సిజేరియన్‌ చేయాలని కోరడం, కొంత మంది వైద్యులు, చాలా మంది గర్భిణిలకు హైబీపీ, రక్తహీనత, షుగర్‌, థైరాయిడ్‌, గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం, ఉమ్మునీరు తక్కువగా ఉండటం వంటి హైరిస్క్‌ కారణాలతో సిజేరియన్‌ ఆపరేషన్లు చేయాల్సి వస్తోందని అధికారులకు ఆయా ఆసుపత్రుల నిర్వాహకులు వివరణ ఇస్తున్నారు. అయితే కొన్ని ఆసుపత్రులు, వైద్యులు సిజేరియన్‌ చేస్తే ప్యాకేజి, డబ్బులు ఎక్కువ వస్తాయని కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గత ప్రభుత్వంలో 60శాతం ప్రభుత్వాసుపత్రుల్లోనే!

సంవత్సరం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు ప్రసవాల శాతం హైరిస్క్‌ గర్భిణిల శాతం

2019-20 39,140 61.33 19.69

2020-21 36,170 57.60 19.32

2021-22 27,305 58.47 19.08

2022-23 26,433 51.42 17.10

2023-24 28,108 54.39 21.30

† గత ప్రభుత్వంలో ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరేసి మెడికల్‌ ఆఫీసర్లు ఉండగా.. ఒకరు క్షేత్రస్థాయికి వెళ్లినా మరొకరు ఆసుపత్రిలోనే ఉండి రోగులకు చికిత్సలు అందించే పరిస్థితి. రాత్రివేళల్లోనూ నర్సింగ్‌ సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టారు. వైద్యులు ఫోన్‌ చేస్తే వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం ప్రసవాల సంఖ్య తగ్గేందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement