పెరిగిన అనవసర ఖర్చు
● ధర తెలుసుకోవడం దాదాపుగా
మానేశారు
● రూ.5 మొదలు వేల రూపాయల
లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే..
● తలకిందులవుతున్న ఫ్యామిలీ బడ్జెట్
● ఎంత సంపాదిస్తున్నా
ఇట్టే అయిపోతుందనే భావన
● కోవిడ్ తర్వాత అన్నీ
డిజిటల్ చెల్లింపులే..
● చిల్లర కొరత నేపథ్యంలోనూ
మారిన తీరు
● ఆదోనికి చెందిన నాగేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. చిరుద్యోగమే అయినా 20 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉండటంతో జీతం రూ.లక్షకు పైగా వస్తోంది. మొదట్లో తాను ఖర్చుచేసిన ప్రతిదీ ఓ పుస్తకంలో రాసుకునే అలవాటు ఉండేది. అన్ని ఖర్చులు పోను నెలకు 30శాతం దాకా మిగిలేది. కానీ ఇటీవల డిజిటల్ అకౌంట్‌లో ఖర్చు పెడుతూ లెక్క రాసుకోవడం మానేశాడు. నెల తిరిగేసరికి బ్యాంకు ఖాతా ఖాళీ అవుతోంది. ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఆన్‌లైన్‌లో తెలియకుండానే తానే ఖర్చు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు.
● కర్నూలు నగరంలోని ఎ.క్యాంపునకు చెందిన వెంకట్ ఓ ప్రైవేటు కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన జీతం నెలకు రూ.60వేలు. వచ్చిన జీతంతో ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులతో హాయిగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో నెలాఖరుకు అకౌంట్‌లో డబ్బులన్నీ అయిపోయినట్లు గమనిస్తున్నాడు. ఇంత డబ్బు ఏమైందని పరిశీలిస్తే అదంతా డిజిటల్ పేమెంట్స్ ద్వారా తానే ఖర్చు చేసినట్లు నిర్ధారించుకున్నాడు.
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాలు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే సాగుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఉపయోగించాలంటే భయపడే జనం ఇప్పుడు అవలీలగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఎంతగా అంటే రూ.5 నుంచి వేల రూపాయల వరకు ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసినా, ఎవరికై నా డబ్బు పంపాలన్నా, అప్పు ఇవ్వాలన్నా, తీసుకున్న రుణం తీర్చాలన్నా, ఇతర ఎలాంటి లావాదేవీలైనా సరే డిజిటల్ పేమెంట్ తప్పనిసరి అవుతోంది. ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియనంతగా వీటి వినియోగం ఉంటోంది. అయితే పెట్టే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతోంది. దీన్నిబట్టి ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత ఏఏ ఖాతాలకు మళ్లిస్తున్నారు, ఎవరెవరికి చెల్లిస్తున్నారు, వీరికి ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయనే విషయాలన్నీ బ్యాంకుల వారికి తెలిసిపోతోంది. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా సరే అన్ని వివరాలు ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా మనకు తెలియకుండానే బ్యాంకులకు/ప్రభుత్వానికి చెప్పేస్తున్నాయన్న మాట.
కోవిడ్ తర్వాత ఊపందుకున్న పేమెంట్స్
డిజిటల్ పేమెంట్స్ రూపంలో పదేళ్ల క్రితం డెబిట్, క్రెడిట్‌కార్డులు, గిఫ్ట్‌కార్డులు వచ్చాయి. కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వాటిని వ్యాపార దుకాణాల్లో స్క్రాచ్ చేసి డబ్బులు చెల్లించేవారు. కొంత కాలం తర్వాత ఇవే కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లోనే వస్తువులను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కోవిడ్ అనంతరం వ్యాపార లావాదేవీల్లో మరింత సరళతరం వచ్చింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా జనం డబ్బు చెల్లించడం, తీసుకోవడం ప్రారంభించారు. కోవిడ్ కారణంగా డబ్బుల మార్పిడి వల్ల ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనని భయపడి ఈ పేమెంట్స్‌కు అలవాటు పడ్డారు. ఎంతగా అంటే రూ.5ల కొనుగోలుకు సైతం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. మొదట్లో ఇలా డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడని వ్యాపారులు సైతం క్రమంగా అంగీకరించక తప్పని పరిస్థితి. చిల్లర కొరత కారణంగా కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి.
డబ్బులు ఏట్లో పారేసినా లెక్క పెట్టి పారేయాలన్నది పెద్దల మాట. అంటే చేతితో డబ్బులు లెక్క పెట్టి పారేస్తూ ఉంటే దాని విలువ తెలుస్తుందని భావన. అలాగే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ ఏదైనా పుస్తకంలో రాసుకుంటే నెల చివరలో దేనికెంత ఖర్చు పెట్టాము.. ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నాము.. ఏ ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎక్కడ మిగిలించాలనే విషయాలు తెలుస్తాయి. దీన్ని బట్టే ఫ్యామిలీ బడ్జెట్ రూపొందించుకోవచ్చు. కానీ ఇటీవల డిజిటల్ పేమెంట్స్, ఆన్‌లైన్ కొనుగోళ్ల పుణ్యమా అని ఎంత డబ్బు వస్తున్నా ఇట్టే అయిపోతోంది. లెక్క పెట్టకుండా ఖర్చు చేయడం వల్లే ఈ సమస్య వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
పెరిగిన అనవసర ఖర్చు
Comments
Please login to add a commentAdd a comment