కార్మికుల పేర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

కార్మికుల పేర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు

Published Mon, Apr 7 2025 10:12 AM | Last Updated on Mon, Apr 7 2025 10:12 AM

కార్మ

కార్మికుల పేర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు

కర్నూలు(అర్బన్‌): ఈ– శ్రమ్‌ పోర్టల్‌లో ఫ్లాట్‌ ఫాం కార్మికులు, గిగ్‌ కార్మికుల పేర్లను నమోదు చేయించేందుకు ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక నమోదు శిబిరాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్‌ కే వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ – శ్రమ్‌ పోర్టల్‌లో కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయం, మెప్మా, డీఆర్‌డీఏ అధికారులను సంప్రదించాలని సూచించారు. కర్నూలుకు చెందిన వారు 9492555168, ఆదోనికి చెందిన వారు 9492555170 నంబర్లను సంప్రదించి వివరాలను పొందాలని కోరారు.

శ్రీశైలంలో 15న కుంభోత్సవం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 15న భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థాన పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. కుంభోత్సవం నిర్వహించే రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అమ్మవారి ఆలయ మెట్ల మార్గంలో అదనపు క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. దేవదాయ చట్టాన్ని అనుసరించి క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధించామన్నారు. క్షేత్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో కూడా పోలీసు, రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో దేవస్థాన వైదిక సిబ్బంది, శాఖాధిపతులు, విభిన్న విభాగాల పర్యవేక్షకులు, తహసీల్దార్‌ కేవీ శ్రీనివాసులు, సీఐ ప్రసాదరావు పాల్గొన్నారు.

టైర్‌ పేలి స్కార్పియోను ఢీకొట్టిన లారీ

యువకుడి దుర్మరణం

ఎమ్మిగనూరురూరల్‌: టైర్‌ పేలిన లారీ..స్కార్పియోను ఢీ కొట్టడంతో తల్లికి తీవ్ర గాయం కాగా ఆమె కుమారుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఎమ్మిగనూరు మండలం కోటేకల్‌ కొండల సమీపంలోని ఫారెస్ట్‌ దగ్గర ఆదివారం చోటుచేసుకుంది. కిడ్నీలో రాళ్లు ఉండటంతో తల్లి మంగమ్మకు కర్నూలులో ఆపరేషన్‌ చేశారు. దీంతో ఆదోని పట్టణానికి చెందిన ప్రహ్లాద్‌(30) తన తల్లితో కర్నూలు నుంచి స్కార్పియోలో ఆదోనికి వస్తున్నారు. కోటేకల్‌ కొండల సమీపంలో వేగంగా ఎమ్మిగనూరు వైపు వస్తున్న లారీ టైర్‌ పేలిపోవటంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న స్కార్పియోను ఢీ కొట్టింది. దీంతో స్కార్పియోలో డ్రైవింగ్‌ చేస్తున్న ప్రహ్లాద్‌ సీట్లో ఇరుక్కుపోవటం, తలకు బలమైన గాయం కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే కూర్చున్న మృతుడి తల్లి మంగమ్మకు తలకు గాయమైంది. ప్రమాద విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించారు. అతి కష్టం మీద సీట్లో ఇరుక్కుపోయిన ప్రహ్లాద్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య శ్రావణి, ఇద్దరు సంతానం ఉన్నారు. గాయపడ్డ మంగమ్మను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు.

వారిది ఆత్మహత్యాయత్నం

పాములపాడు: ఇస్కాల గ్రామంలో సోమేశ్వరుడు అనే రైతు నలుగురు కుటుంబ సభ్యులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ తెలిపారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అతిసార లక్షణాలతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆదివారం ఇస్కాలను సందర్శించారు. అయితే గ్రామంలో డయేరియా కేసులు లేవని నిర్ధారించారు. సోమేశ్వరుడు అప్పులబాధతో కుటుంబసభ్యులతో కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసిందన్నారు. విషయాన్ని జిల్లా కలెక్టర్‌ రాజకుమారికి సమాచారం ఇచ్చామన్నారు.

కార్మికుల పేర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు 1
1/1

కార్మికుల పేర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement