
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
● నంద్యాలలో గరిష్టంగా 41.5 డిగ్రీల
ఉష్ణోగ్రత నమోదు
కర్నూలు (అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కర్నూలులోని ప్రధాన కూడళ్లలో ఎట్టకేలకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తుండటం విశేషం. సోమవారం నంద్యాలలో 41.5 డిగ్రీలు, రుద్రవరంలో 41.1, కౌతాళంలో 41.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
డీబీసీడబ్ల్యూఈఓ బాధ్యతల స్వీకరణ
కర్నూలు(అర్బన్): జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణిగా కే.ప్రసూన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బీసీ సంక్షేమ శాఖల్లో ఇటీవల జరిగిన పదోన్నతుల్లో భాగంగా నెల్లూరు సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారిణిగా ఉన్న ప్రసూనను డీబీసీడబ్ల్యూఈఓగా పదోన్నతి కల్పించి ప్రభుత్వం ఇక్కడకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సహాయ బీసీ సంక్షేమాధికారులు, బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం నేతలు ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. సహాయ బీసీ సంక్షేమాధికారులు ఆంజనేయులునాయక్, రాజా కుళ్లాయప్ప, అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు పాలెగార్ సత్యనారాయణరాజు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. నూతన డీబీసీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. జిల్లాలోని వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
శరవేగంగా పది మూల్యాంకనం
కర్నూలు సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం శరవేగంగా కొనసాగుతోంది. ఈ నెల 3వ తేదీన మొదలైన స్పాట్ సోమవారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. మొదటి రోజున హిందీ, తెలుగు, సోషల్ సబ్జెక్టులకు సిబ్బంది కొరత వచ్చింది. కస్తూర్బా స్కూళ్ల టీచర్లతో పాటు, మరి కొంత మందికి ఉత్తర్వులు ఇవ్వడంతో వారు విధులు చేరడంతో రెండో రోజు నుంచి మూల్యాంకనంలో వేగం పుంజుకుంది. ఈ నెల 9వ తేదీన క్యాంపు ముగించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేశారు. 1,44,180 పేపర్లు జిల్లాకు రాగా, ఇందులో 75.31 శాతం మూల్యాంకనం పూర్తి చేసినట్లు డీఈఓ ఎస్.శామ్యూల్‌పాల్ తెలిపారు. ఇందు లో మొత్తం 116 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 690 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 202 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొన్నారని, సిబ్బందికి ఎక్కడా కూడా అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ పేర్కొన్నారు.