
మెరుగైన జీవన విధానంతోనే ఆరోగ్యం
కర్నూలు(హాస్పిటల్): ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందుకు అనుగుణంగా జీవన విధానాన్ని మలచుకోవాలని రాష్ట్ర భారీ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కర్నూలు డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో బ్లడ్‌బ్యాంకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 38 మంది దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా చక్రాల కుర్చీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఇందులో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ముందుంటుందని కొనియాడారు. త్వరలో కర్నూలుకు స్కిన్ సెంటర్ రావడం ఆనందకరమని, ఇది రాష్ట్రంలోనే మొదటిది అవుతుందన్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ రయీస్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.